రాగం : నాట
దేవ శిఖామణి దివిజులు వొగడగ
వేవేలు గతలు వెలసీ వాడే || ||దేవ శిఖామణి దివిజులు||
వీధుల వీధుల వెసతురగముపై
భేదిల బల్లెము బిరబిరదిప్పుచు
మోదము తోడుత మోహనమూరితి
ఏదెస జూచిన నేగీ వాడే || ||దేవ శిఖామణి దివిజులు||
కన్నులు తిప్పుచు కర్ణములు కదల
సన్నల రాగెకు చౌకళింపుచును
అన్నిటా తేజియాడగ దేవుడు
తిన్నగ వాగేలు దిప్పీ వాడే || ||దేవ శిఖామణి దివిజులు||
వలగొన తిరుగుచు వాలము విసరుచు
నిలిచి గుఱ్ఱమటు నేర్పులు చూపగ
బలు శ్రీవేంకటపతి అహోబలపు
పొలమున సారెకు పొదలీవాడే || ||దేవ శిఖామణి దివిజులు||