రాగం : భైరవి
చూడుడిందరికి సులభుడు హరి
తోడు నీడయగు దొరముని యితడు||
కైవల్యమునకు కనకపు తాపల-
త్రోవై శ్రుతులకు తుదిపదమై
పావన మొకరూపమై విరజకు
నావై యున్నాడిదె యితడు||
కాపాడ గ లోకములకు సుజ్ఞాన
దీపమై జగతికి తేజమై
పాపాలడపగ భవపయోధులకు
తేపైయున్నాడిదే యితడు||
కరుణానిధి రంగపతికి కాంచీ-
వరునకు వేంకటగిరిపతికి
నిరతి నహోబలనృకేసరికి త-
త్పరుడగు శఠగోపముని యితడు||