Tuesday, November 26, 2024

అన్నమయ్య కీర్తనలు : ఎంత కాలమో కదా


రాగం : నీలాంబరి

ఎంత కాలమో కదా యీదేహధారణము
చింతా పరంపరల చిక్కువడ వలసే || ||ఎంత కాలమో కదా||

వడిగొన్న మోహంబు వలల తగులైకదా
కడలేని గర్భనరకము లీదవలసె
నడిమి సుఖములచేత ననుపు సేయక కదా
తొడరి హేయపు దిట్టి దూరాడ వలసే || ||ఎంత కాలమో కదా||

పాపపుంజములచే పట్టువడక కదా
ఆపదలతోడి దేహము మోవవలసె
చూపులకు లోనైన సుఖము కానక కదా
దీపన భ్రాంతిచే తిరుగాడ వలసే || ||ఎంత కాలమో కదా||

హితుడైన తిరువేంకటేశు కొలువక కదా
ప్రతిలేని నరక కూపమున బడవలసే
అతని కరుణామృతంబబ్బకండక కదా
బతిమాలి నలుగడల పారాడవలసే || ||ఎంత కాలమో కదా||

Advertisement

తాజా వార్తలు

Advertisement