రాగం : కవరాలి
పరదియారు వన్నెల బంగారు కాంతులతోడ
పొదలిన కలశాపుర హనుమంతుడు || ||పరదియారు వన్నెల||
ఎడమ చేతబట్టె నిదివో పండ్లగొలి
కుడిచేత రాకాసిగుంపుల గొట్టె
తొడిబడ నూరుపులతో తూరుపు మొగమైనాడు
పొడవైన కలశాపుర హనుమంతుడు || ||పరదియారు వన్నెల||
తొక్కె అక్షకుమారుని తుంచి యడగాళ్ళ సంది
నిక్కించెను తోక ఎత్తి నింగి మోవను
చుక్కలు మోవ పెరిగి సుతువద్ద వేదాలు
పుక్కిటబెట్టె కలశాపుర హనుమంతుడు || ||పరదియారు వన్నెల||
- Advertisement -
గట్టి దివ్యాంబరముతో కవచకుండలాలతో
పట్టపు శ్రీ వేంకటేశు బంటు తానాయె
అట్టె వాయువునకు అంజనిదేవికిని
పుట్టినాడు కలశాపుర హనుమంతుడు || ||పరదియారు వన్నెల||