ఇదివో సుద్దులు ఈరేపల్లెను
కదిపి ఇందరివి గైకొనవయ్య ||
పలుచని రెప్పల పగటులు నెరుపుచు
సొలసి నిన్నొకతె చూచెనట
తళుకుల గోళ్ళుదండె మీటి యిదె
పలికి నిన్నొకతె పాడెనట ||
చనవులు నెరపుచు సన్నసేయుచును
ననుపున నొక్కతె నవ్వెనట
చెనకి యొక్కతె అదె చిగురు గేదగుల
వెనక నుండి నిను వేసెనట ||
అదన నీవు నన్ను అలమి పట్టంగా
కొదలి యొక్కతె కని గొణిగెనట
ఎదురనె శ్రీ వేంకటేశ యొకతె నీ
చెదరిన అలుకలు చెరిగెనట ||