అలవటపత్రశాయివైన రూపము ఇట్టిదని
కొలువై పొడచూపేవా గోవిందారాజా ||
పడతు లిద్దరి మీద పాదములు చాచుకొని
ఒడికపు రాజసాన నొత్తిగిలి
కడలేని నిజనాభికమలమున బ్రహ్మను
కొడుకుగా కంటివిదె గోవిందరాజా ||
సిరుల సొమ్ములతోడ శేషునిపై పవళించి
సొరిది దాసుల కృప జూచుకొంటాను
పరగు దైత్యుల మీద పామువిషములే నీవు
కురియించితివిగా గోవిందరాజా ||
శంకు చక్రములతోడ చాచినకరముతోడ
అంకెల శిరసుకింది హస్తముతోడ
తెంకిని శ్రీ వేంకటాద్రి దిగువతిరుపతిలో
కొంకక వరములిచ్చే గోవిందరాజా ||