రాగం : హరికాంభోజి
ప|| అన్నిటా భాగ్యవంతుడ వవుదువయ్యా
పన్నినందుకల్లా వచ్చు భామ నీ కిపుడు ||
చ|| పడతి మోహరసము పన్నీటి మజ్జనము
కడలేని ఆపె సిగ్గు కప్పురకాపు
నిడుదకన్నున చూపులు నించిన తట్టుపునుగు
తొడిబడ సులభాన దొరకె నీ కిపుడు ||
చ|| కామిని కెమ్మోవికాంతి కట్టుకొనే చంద్రకావి
ఆముకొన్నమోముకళలు ఆభరణాలు
దోమటి మాటలవిందు ధూపదీప నైవేద్యాలు
కామించినటువలెనే కలిగి నీ కిపుడు ||
చ|| అలమేలు మంగనవ్వులు అంగపు పువ్వుదండలు
కలసి పురాన నీకె కట్టిన తాళి
చలపట్టి ఈకె రతి సకలసంపదలు
ఇలనబ్బె శ్రీ వేంకటేశ నీకు నిపుడు ||