రాగం : దర్బార్
ప|| అతడే పరబ్రహ్మమతడే లోకనాయకుడు
అతని కంటే మరి అధికులు వేరయ్యా !
చ|| కమలవాసిని లక్ష్మి కలదా యెవ్వరికైనా
కమలనాభునికి ఒక్కనికే గాక
కమలజుడైన బ్రహ్మ కలడా యెవ్వని నాభి
నమరవంద్యుడు మా హరికే గాక
చ|| అందరు నుండెడి భూమి అన్యులకు గలదా
అందపు గోవిందునికే ఆలాయగాక
చెందిన భాగీరథి శ్రీపాదాల గలదా
మందర ధరుడయిన మాధవునికి గాక
చ|| నిచ్చలు అభయమిచ్చే నేరుపు యెందుగలదా
అచ్చుగ నారాయణునియందేగాక
రచ్చల శరణాగతరక్షణ మెందు గలదా
తచ్చిన శ్రీ వేంకటాద్రి దైవానికేకాక