ప|| చెప్పరాని మహిమల శ్రీదేవు డితడు
కప్పి కన్నుల పండుగగా జూడరో || చెప్పరాని ||
చ|| అద్దుచు కప్పుర ధూళి యట్టెమేన నలదగా
వొద్దిక దేవుని భావమూహించితేను
ముద్దులు విరిసినట్టి మంచి బాలకృష్ణునికి
ముద్దుల కాంతి మేన మలసినట్టుండె || చెప్పరాని ||
చ|| అమర తట్టుపుణుగు అవధరించగాను
తమితో పోలికలెల్ల దచ్చిచూడగా
యమునానది నాగేట నండ దీసుకొనగా
యమునానది నలుపు అంటిన యట్టుండే || చెప్పరాని ||
చ|| అంగములు శ్రీ వేంకటాధిపున కింతటాను
సింగారించి సొమ్ములెల్ల చెలరేగగా
బంగారపు టలమేలుమంగ నురాననుంచగా
బంగారము మేనెల్లా బరగినట్టందె || చెప్పరాని ||