ప|| కొమ్మలాలా ఎంతవాడె గోవిందరాజు
కుమ్మరించీ రాజసమే గోవిందరాజు || కొమ్మలాలా ||
చ|| ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవళించి
కొలువు సేయించు కొనీ గోవిందరాజు
జలజాక్షు లిద్దరును సరిపాదా లొత్తగాను
కొలదిమీర మెచ్చీనీ గోవిందరాజు || కొమ్మలాలా ||
చ|| అదె నాభికమలాన అజుని పుట్టించి తాను
కొదలేక వున్నవాడు గోవిందరాజు
చెదరక తన వద్ద సేవ సేసే సతులకు
గుదిగుచ్చీ వలపులు గోవిందరాజు || కొమ్మలాలా ||
చ|| ఒప్పుగా వామకరము ఒగిచాచి వలకేల
కొప్పు కడునెత్తినాడు గోవిందరాజు
ఇప్పుుడు శ్రీ వేంకటాద్రి నిరవై శంఖుచక్రాలు
కుప్పె కటారము(లు) పట్టె గోవిందరాజు|| కొమ్మలాలా ||