ప|| కొలనిదోపరికి గొబ్బిళ్ళోయదు
కులస్వామికి గొబ్బిళ్ళో || కొలని ||
చ|| కొండ గొడుగుగా గోవులగాచిన
కొండుక శిశువుకు గొబ్బిళ్ళో
దుండగంపుదైత్యుల కెల్లను తల
గుండు గండనికి గొబ్బిళ్ళో || కొలని ||
చ|| పాప విధుల శిశుపాలుని తిట్టుల
కోపగానికి గొబ్బిళ్ళో
యేపున కంసుని యిడుమలబెట్టిన
గోపబాలునికి గొబ్బిళ్ళో || కొలని ||
చ|| దండివైరులను తఱిమిన దనుజుల
గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిపైడియగు వేంకటగిరి పై
కొండలయ్యకును గొబ్బిళ్ళో || కొలని ||