Friday, November 22, 2024

నిర్మాత వివేక్‌, రచయిత పురాణపండకు కృతజ్ఞతలు తెలిపిన అంజి

అమలాపురం, (ఆంధ్రప్రభ) : ఆగమనిగమాలకు ఆధారమైన దైవీయకాంతుల్ని అనంత వైభవాల స్తోత్రగ్రంథాలతో, వ్యాఖ్యాన గుణకీర్తులతో వందలకొలది గడపలకు పావనస్పర్శలుగా అందిస్తున్న ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధికారిక మాసపత్రిక ఆరాధన పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్‌ రచనా వైభవాల పవిత్ర గ్రంథాల తేజోరేఖల కటాక్షం ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వశ్రేష్టతతో సంచలనం సృష్టిస్తున్నాయి.

ఇటీవల కాకినాడ, అమలాపురంలలో విఖ్యాత చిత్రకారుడు ఆకొండి అంజి ఆధ్వర్యంలో క్రియేటివ్‌ ఆర్ట్స్‌ సమర్పించిన వైభవోపేత రాష్ట్రస్థాయి చిత్రకళల పోటీల్లోనే కాకుండా ఇటు ద్రాక్షారామంలో ప్రముఖకవి, సాంఘికసేవల్లో తొలివరుసలో నిలిచే ఉపాధ్యాయుడు కూచిభొట్ల జనార్దనస్వామి సౌజన్యంతో సర్వతోముఖ ప్రకాశమైన పురాణపండ రచనా సంకలనాలు వందలమంది భక్తులకు ఉచితంగా పంచడం విశేషం.

రాజమహేంద్రవరం ఉమామార్కండేయస్వామి దేవస్థానంలో జ్ఞానసరస్వతీ దేవాలయ ట్రస్టీ తోట సుబ్బారావు సారథ్యంలోని జ్ఞానసరస్వతీ ఆలయంలో రోటేరియన్‌ గంగరాజు, మిల్క్‌ డైరీ చైర్మన్‌ నిమ్మలపూడి గోవింద్‌, సవితాల చక్రభాస్కర్‌ వైదిక క్రియల గాయత్రీపీఠంలో ఇలా నగరంలోని అనేక ఆలయాల్లో పురాణపండ అపురూప గ్రంథాలను వందలాదిమందికి ఉచితంగా పంచడం ఆశ్చర్యపరుస్తోంది.

సౌందర్యరూప దర్శనాలుగా అద్భుతచిత్రాలను చిత్రిస్తూ వందలకొలది అభిమానుల్ని సృష్టించుకున్న ప్రముఖ చిత్రకారుడు ఆకొండి అంజి, తన మిత్రబృందంతో అమలాపురం, కాకినాడలో ఏర్పాటు చేసే వేడుకల్లో ప్రథమతాంబూలంగా జ్ఞాపికతోపాటు పురాణపండ శ్రీనివాస్‌ గ్రంథాలను బహూకరిస్తుంటే అతిథుల ఆనందాన్ని వర్ణించలేమని, తనకి ఈ సహకారం అందించిన సినీ నిర్మాత కూచిభొట్ల వివేక్‌కు, ఇంతటి పవిత్ర ఘనకార్యాన్ని ఏస్వార్థం లేకుండా అందిస్తున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోనూ, అంబికా గ్రూప్‌ చైర్మన్‌ అంబికా కృష్ణ ఏలూరులోనూ అనేక సాంస్కృతిక వేడుకల్లో, దైవకార్యాల్లో పురాణపండ గ్రంథాలను బహూకరించడం మేధో సమాజాన్ని సైతం ఆకర్షిస్తోంది.

- Advertisement -

పురాణపండ శ్రీనివాస్‌ ఇప్పటికి 27 వివిధ ఆధ్యాత్మిక వైభవాలను ఎంతో అద్భుతంగా అందించడం వల్లనే ఈ అసాధారణ స్పందన లభిస్తోందని ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన అనేక ఆలయాల పండిత అర్చకులు, ధర్మకర్తలు ముక్తకంఠంతో ప్రశంసిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాలలో ఈ పవిత్ర మహోద్యమానికి మనసా సహకరిస్తున్న స్టాండర్డ్‌ ఎలక్ట్రానిక్స్‌ డైరెక్టర్‌ చెన్నాప్రగడ శ్రీనివాస్‌(బాబు)కి ఎన్నో ఆలయాల నిర్వాహకులు ధన్యవాదాలు తెలపడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement