Saturday, November 23, 2024

అనంత అన్వేషణ

సృష్టికర్త ఒకడున్నాడు అనేది ప్రపంచ విశ్వాసం. ఆయ నను అనేక రూపాలతో, నామాలతో, ఆకృతులతో, శూన్యభావంతో, అనిర్వచనీయమైన ఆలోచనతో ఏమైతేనేమి తుదకు ఒకడున్నాడు అనేది లోక నమ్మకం. ఇటువంటి భావన లకు బీజం వేసింది సనాతన వైదిక ధర్మం. మానవునికి మిగిలిన జీవులకు ఉన్న ప్రత్యేకతను వెలికితీసింది. మానవుని మేధను గుర్తింపచేసింది. మనిషికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ లక్ష్యాన్ని ఆనందం వైపు పయనింపచేసింది. అనుభూతిని పొందేలా చేసిం ది. అంతంలేని అద్భుత అనుభూతిని పొందేలా చేసింది. తనకు తాను తాదాత్మ్యం చెందేలా చేసింది. ఇతరులను సంతోషపర చేలా చేసింది. చివరకు జీవులన్నీ తనలాగే ఒకే ఆత్మరూపమనే సత్యా న్ని ఆవిష్కరించింది. స్వల్పమైన ఈ జీవితకాలాన్ని ఎలా ఉపయుక్తం చేసుకోవాలో నేర్పింది. అసలు తాత్విక జ్ఞానాన్ని మొట్టమొదట అందించింది ఈ సనాతన ధర్మమార్గము. అటువంటి వాటిలో శ్వేతాశ్వర ఉపనిషత్తు జిజ్ఞాసను కలిగించడంలో ప్రథమంగా నిలిచింది.
హరి: ఓం బ్రహ్మవాదినో వదంతి
కిం కారణం బ్రహ్మకుత: స్మజాతా
జీవామకేన క్వచ సంప్రతిష్ఠా
అధిష్ఠితా: కేన సుఖేత రేషు
వర్తామహే బ్రహ్మ విదో వ్యవస్థామ్‌!!
బ్రహ్మమును తెలుసుకునేవారు అనగా సృష్టికర్తను తెలుసుకునేవారు తమ అంతరంగంలో ఇలా చర్చించుకుంటారు.
”సృష్టికి మూలకారణం ఏమిటి? అది బ్రహ్మమా? లేక వేరొకటా? మనం ఎక్కడ నుంచి వచ్చాం? ఎలా జన్మించినాము? ఎందుకు జన్మిం చాం? మనం ఎందుకు జీవించాలి? ఎవరికోసం జీవించాలి? మన గమ్యం ఏమిటి? మన చివరిస్థానం ఈ భూమిమీద ఎక్కడ? ఎవరు మనలను నియమించారు? ఎవరి నియమానుసారం బ్రహ్మవిదులమైన మనం ఎవరికి, దేనికి లోబడి ఉంటున్నాము? సుఖదు:ఖాల వ్యవస్థ ఏమిటి? సుఖ మంటే ఏమిటి? దు:ఖమంటే ఏమిటి? మనం ఎవరి నియంత్రణలో ఉన్నా ము? మొదలైన ప్రశ్నలు పరమ తాత్త్వికమైనవి. ఇవి మనిషిలో ఉత్పన్న మవడమే జ్ఞానమంటే! బ్రహ్మసూత్రాలు కూడా ఇదేవిధమైన జిజ్ఞాసను మనిషికి కలిగిస్తాయి. ఈ జ్ఞానమే మనిషికి మిగిలిన జీవులకు మధ్యనున్న ప్రత్యేకత. అయితే మిగిలిన జీవులకూ ఈ జ్ఞానం ఉండవచ్చు. అయితే అవి వ్యక్తం చేయలేవు. కాని భౌతికంగా అవి వ్యక్తంచేసిన సందర్భములు న్నాయి. అది గుర్తించిన మనిషి మరింత తాత్త్విక చింతనకు గురవుతూనే ఉన్నాడు.
పై ప్రశ్నలు అనేక పరిశీలనలకు దోహదం చేసాయి. ప్రతి దానికి కార ణం ఉంటుందని, కారణం స్వరూపమేమిటని, అలాగే విశ్వానికి మూల కారణం ఉంటుందని, అది బ్రహ్మమేనానని, లేక కాలము, ప్రకృతి మొదలై నవి కూడానని, ఉపాదాన కారణం నిమిత్త కారణాలు కూడానని ఇలా అనేక పరిశీలనలు మొదలయ్యాయి. విశ్వం సృష్టించబడినది. ఎందుకు సృష్టించ బడినది? విశ్వం సంపూర్ణ మా లేక అసంపూర్ణమా? విశ్వంలో ప్రతి విషయా నికి ఒక కారణం అవసర మని ఎందుకు భావన కలుగుతోంది?
జీవిత రహస్యం, జీవించడం ఎందుకు, జన్మ కారణం, ఈ సృష్టికి మనిషి కి గల సంబంధం ఏమిటి? మొదలయిన ప్రశ్నలకు సమాధానాల కోసం అన్వేషణ మొదలయ్యింది ఇక్కడే! ఇక మృత్యువంటే ఏమిటి? ప్రాణం పోవడం, తరువాత అది ఎక్కడికి వెడుతుంది, మళ్ళీ జన్మ ఉందా, ముక్తి, మోక్షం, పరమాత్మలో లీనమవడం మొదలయిన సందేహాలకు అన్వేషణ కూడా మొదలయ్యింది ఇక్కడే! మానవుడు సర్వ స్వతంత్రుడ యితే దు:ఖాన్నుండి ఎందుకు తప్పుకోలేకపోతున్నాడు. మనిషి దు:ఖం నుండి తప్పించుకోవడానికి తగిన పద్ధతిని తనంత తానుగానే ఎందుకు ఎంపిక చేసుకోలేకపోతున్నాడు. ఇలా అనేక ప్రశ్నలు, సందేహాలు ఉత్పన్న మవడమే ఒక జ్ఞానము, జిజ్ఞాస అని మనం భావించవచ్చు.
అనేక ప్రశ్నలను, సందేహాలను, సమాహారాలను చైతన్యవంతమైన చింతన చేస్తే లభించిన పరమ సత్యం, ఈ అనంత విశ్వం, సృష్టి, జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి, త్రిగుణాలు, మాయ ఇవన్నియూ ఒక అపూర్వమైన నియమాన్ని అనుసరించి, ఒక పద్ధతి ప్రకారం సమన్వయంతో చలిస్తున్నా యని బోధపడుతుంది. ప్రతి అంశానికి ఒక ఆవాసము, కాల నియమము, నిశ్చితమైన సమయము మొదలైనవాటితో నిబద్ధమై నడుస్తున్నాయని తెలు స్తుంది. వీటన్నింటికీ ఆవల ఒక ‘శక్తి’ సర్వమూ నియంత్రిస్తున్నదని బోధప డుతుంది. ఇది యాదృచ్ఛికం కానేకాదని గ్రహిస్తారు. ఈ బ్రహ్మాండానికి ఆవల నియామకుడు ఉన్నాడనే సత్యమే జ్ఞానమని అవగతవ ువుతుంది. ఈ అనంత ప్రహేళిక ఆయన దృష్టిలో ఒక ఖచ్చితమైన అణుమాత్ర చిత్రం.
వాలాగ్ర శత భాగస్య శతధా కల్పితస్యచ!
భాగో జీవ: సవిజ్ఞేయ: సచానం త్యాయ కల్పతే!!
జీవాత్మ వెంట్రుక యొక్క నూరవ భాగంలో నూరవ భాగమంత సూక్ష్మమైనది. అయి నా అది అనంతత్వా న్ని పొందగలదు. అదే విశ్వ రహస్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement