Thursday, November 28, 2024

పరోపకారం

పరోపకారం అంటే ఏమిటి? అనే ప్రశ్నకు వెనువెంటనే వచ్చు జవాబు పరులకు ఉపకారం చేయడం. ఇతరులకు సాయం చేయడం. తోటి వారి కష్టాలలో పాలు పంచుకోవడం. ఇంతేనా అంటే కాదు, మరేదో ఉంది. ‘పరోపకారార్ధమ్‌ ఇదం శరీరమ్‌’ అన్న ఆర్యోక్తిని బట్టి స్ఫురించే అర్థం వేరేగా ఉంది. మన శరీరాన్ని పరుల కోసం వినియోగించాలని దానర్థం. పూర్వం ఒక పావురాన్ని కాపాడటం కోసం శిబి చక్రవర్తి తన శరీరాన్ని కోసి ఇవ్వడం, వృత్తాసురుని సంహరించేందుకు గాను దధీచి ఇంద్రునికి తన వెన్నెముకను తీసి ఇవ్వడం, దేవేంద్రుడికి తన కవచకుండలాలను కర్ణుడు కోసి ఇవ్వడం లాంటివన్నమాట. అయితే ఈ పనులు ఈ కాలంలో సాధ్యమా? అనే ప్రశ్న ఉదయించక మానదు. దీనికి సమాధానం ఒకటే. ఇప్పటి అవయవదానాన్ని పురాణ పురుషుల త్యాగంతో సమానమని పోల్చవచ్చు. ఒక రోగికి తన బంధువు గానీ, మిత్రుడు గానీ ఏదైనా అవయవం దానం చేయడం చూస్తున్నాం. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఈనాడు లోకంలో అక్కడక్కడా జరుగుతున్న సందర్భమే. ఇంకా ఒక వ్యక్తి బ్రెయిన్‌ డెడ్‌ అయిన సమయంలో సంబంధిత వ్యక్తి కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి యొక్క అవయవాలను ఇతరులకు దానం చేయడం చూస్తున్నాం. ఇది అరుదుగా జరుగుతున్న సందర్భం. దీన్ని ఉత్కృష్టమైన త్యాగకార్యంగా చెప్పొచ్చు. తోటివారి క్షేమం కోరి ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు అలా వ్యవ#హరించడం అనన్య సామాన్యం. ఇంకా కొంతమంది చనిపోయిన తర్వాత వారి కళ్లను దానం చేస్తారు. అలాగే కొంతమంది మరణించిన తర్వాత ఆ పార్థివ దేహాన్ని బోధనాసుపత్రులకు అప్పజెప్పుతారు. వీరేగాక సామాజికాభ్యుదయం కోసం తమ ప్రాణాలర్పించిన వారు కూడా పరోపకారులే. ఇవన్నీ అమూల్యమైన త్యాగకార్యాలుగా పేర్కొనవచ్చు.
అయితే ఇదేనా పరోపకారం, ఇంకా ఏమీ లేదా? అని ప్రశ్నించవచ్చు కొందరు. సానుభూతితో, సహానుభూతితో తన చుట్టూ ఉన్న వారి కష్టసుఖాలలో పాలుపంచుకోవడం కూడా పరోపకారమే. అలాగే కష్టములో ఉన్నవారి ఇంటికి పోయి పరామర్శించడం ద్వారా ఆయా వ్యక్తులు స్వాంతన పొందుతారు. ఓదార్పు అనేది దివ్యౌషధం కదా! ఇది కూడా ఒక రకంగా పరోపకారమే. చిత్తశుద్ధితో ఒక ఆశయ సాధనతో అనాథ వృద్ధాశ్రమాలను నడిపించడం పరోపకారమే. రంతిదేవుడిలా ఆకలి తీర్చి ఒక పూట అన్నం పెట్టేవారు కూడా పరోపకారులే. ధనమును దానం చేయడం చాలామంది పరోపకారంగా భావిస్తారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటోది కష్టపడి సంపాదించిన సొమ్ములో కొంత తీసి దానంగా ఇవ్వడం. రెండోది అవినీతితో కోట్లు గడించి, అందులో కొంత సొమ్మును విచ్చలవిడిగా పంచడం. ఇందులో రెండో రకాన్ని పరోపకారం అనలేం. అది ఒక యాంత్రికమైన వితరణ చర్యగా అభివర్ణించవచ్చు. డబ్బులు సంపాదించే వారంతా నీతిపరులు కారు. వీరు పాపభీతితో గుళ్ళు గోపురాలకు, ప్రార్థనా మందిరాలకు లేదా ఇతరత్రాలకు తాము కూడబెట్టిన సొమ్మును విపరీతంగా ఖర్చు చేస్తుంటారు. ఇందులో ఎటువంటి నిజాయితీ, నిస్వార్ధత, త్యాగభావం ఉండదు. ఏదో ఒక స్వార్థం దాగి ఉంటుంది. అందువల్ల ఇది పరోపకారం అనడానికి వీలులేదు. పరోపకారమనేది ఏదీ ఆశించకుండా జరిగేది. ఇతరుల మేలు కోరడంలో ఎలాంటి స్వార్థానికి తావుండని ప్రక్రియ.

  • జానకి
Advertisement

తాజా వార్తలు

Advertisement