శ్రావణ పూర్ణిమ జ్ఞాన స్వరూపమని దేవీ భాగవతం చెబుతోంది. భగవంతుని 21 అంశావతారాలలో ఒకటైన హయగ్రీవ అవతా రం అవతరించిందీ శ్రావణ పూర్ణిమ నాడే. మానవాళికి వేదాలను అందించినదీ ఈరోజే. జ్ఞాన స్వరూపిణి అయిన గాయత్రీ మంత్రం భూమికి దిగివచ్చినది, ఆ మంత్రఅధిష్టాన దేవత వచ్చినది, యజ్ఞోపవీతం తయారైనదీ ఈరోజే. అందుకే జంధ్యాల పౌర్ణమి అనికూడా అంటారు. అన్నాచెల్లెళ్ల అక్కా తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పూర్ణిమ. సిరిసంపదలతో, పూర్ణాయు ష్షుతో సోదరులుండాలని, శ్రావణ పూర్ణిమ నాడు అక్కాచెల్లెళ్ళు, సోదరులకు కట్టే ఓ తోరమే (పట్టీ యే)రాఖీ. అక్కాచెల్లెళ్ళకు రక్షగాఉంటాననే సోద రుల ప్రతినకు ప్రతిరూపమే రాఖీ పండుగ. భవిష్యోత్తర పురాణంలోను, మహాభారత కాలంలోనూ రక్షాబంధన్ ప్రసక్తి కనిపిస్తుంది.
”రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే, ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధలు ఉండవని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడు తుందని.” శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెబుతాడు.
ఇంద్రుడికి రక్ష కట్టిన శచీదేవి
పూర్వం దేవతలు రాక్షసుల యుద్ధంలో దేవేంద్రుడు ఓడిపోవడంతో త్రిలోకాధిపత్యం పోతుంది. అప్పుడు దేవగురువైన బృహస్పతి సలహాతో, శ్రావణ పూర్ణిమనాడు ఇంద్రుని భార్య శచీదేవి, పార్వతీ పరమేశ్వరులకు, లక్ష్మీనారాయ ణులకు పూజలు సలిపి, రక్షను ఇంద్రుని చేతికి కడుతుంది. దేవతలు కూడా పూజలు చేసి, రక్షల ను ఇంద్రుడికి కడతారు. అప్పుడు ఇంద్రుడు రాక్షసులతో యుద్ధంలో గెలిచి, త్రిలోకాధి పత్యా న్ని మళ్ళీ పొందుతాడు. ఆ రకంగా శచీదేవితో ప్రారంభమైన రక్షాబంధనం, అప్పటి నుంచి లోకంలో రక్షాబంధనంగా ప్రాచుర్యం పొందిం దని పురాణాలు చెబుతున్నాయి.
శ్రీకృష్ణుడు- ద్రౌపది
శిశుపాలుడ్ని వధించడానికి శ్రీకృష్ణుడు సుద ర్శన చక్రం ప్రయోగించే సందర్భంలో, కృష్ణుని వేలికి గాయమై ధారాపాతంగా రక్తం కారుతుం ది. అక్కడున్నవారంతా ఏదో చేయాలని పరుగులు తీస్తారు. ద్రౌపది మాత్రం తను కట్టుకున్న పట్టుచీర కొంగు చింపి, కృష్ణుడి వేలుకు కట్టు కడుతుంది. సంతసించిన శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఓ అన్నగా రక్షగా ఉంటానని ద్రౌపదికి మాట యిస్తాడు. ఫలితంగా నిండు సభలో వస్త్రాపహరణ సమయంలో, చీరలిచ్చి ద్రౌపదిని ఆదుకుం టాడు శ్రీకృష్ణ భగవానుడు.
శ్రీ మహావిష్ణువు – బలిచక్రవర్తి
బలిచక్రవర్తి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు పాతాళంలో ఉండిపోతాడు. అప్పుడు లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రక్ష కట్టి మహావిష్ణువును తనతో పంపమని అడుగుతుంది. లక్ష్మీదేవిని సోదరిగా భావించిన బలి చక్రవర్తి ఆమె కోరిక మన్నిస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి శ్రీహ రిని వైకుంఠానికి తీసుకు వెళుతుంది.
యజ్ఞోపవీత ధారణ
ఉపనయనం అయిన వారు పాత జంధ్యాన్ని తీసివేసి, క్రొత్తదానిని ధరించే పర్వదినం జంధ్యా ల పౌర్ణమి. జంధ్యాన్ని యజ్ఞోపవీతం అంటారు. యాగకర్మ చేత పునీతమైన దారం అని అర్థం. పరిపక్వతకు, పరిశుద్ధతకు యజ్ఞోపవీతం దివ్యౌ షధం. యజ్ఞోపవీతానికి ఉండే ముడిని ”బ్రహ్మ ముడి” అంటారు. యజ్ఞోపవీతం యొక్క నవ తంతుల్లో, ఓంకారం, నాగదేవతలు, సోముడు, పితరులు, ప్రజాపతి, వాయువు, సూర్యుడు, యితర దేవతలు, ఉత్తమ దేవగణాలు కొలువై ఉంటారని పండితులు చెబుతారు.
యజ్ఞోపవీతాన్ని బ్రహ్మదేవుడు తయారు చేయగా, శ్రీ మహావిష్ణువు ముప్పిరి పెట్టగా, పరమశివుడు ముడివేయగా, సకల వేద వేదాంగ జ్ఞానానికి, సంకేత రూపమైన సావిత్రీదేవి అభి మంత్రించిందని పెద్దలు చెబుతారు. ఈ రోజున ఉపాసనా కర్మ కూడా చేస్తారు.
”యజ్ఞోపవీతం పరమం పవిత్రం/
ప్రజా పరేర్యత్సహజం పురస్తాత్/
ఆయుశ్చ మగ్య్రం ప్రతిముంచ శుభ్రం/
యజ్ఞోపవీతం బలమస్తు తేజ:”
అనే మంత్రాన్ని పఠిస్తూ ధరించాలి.
”ఉపవీతం ఛిన్న తంతుం
జీర్ణకర్మల దూషితం/
విసజామి యశోబ్రహ్మ
వర్చో దీర్ఘాయురస్తుమే.”
అనే మంత్రాన్ని పఠిస్తూ పాత జంధ్యాన్ని విసర్జన చేయాలి. యజ్ఞోపవీతం ఎలా ఉండాలి, ఎంతుండాలి, ఏది శ్రేష్టం అనేవి తెలుసుకోవాలి.
రక్షా బంధనం విధానం
”యేన బద్దో బలీ రాజా దానవేంద్రో మహాబల:
తేన వ్యామభి బద్నామి రక్ష మాచల మాచల”
అనే శ్లోకం చదువుకున్న తర్వాత రాఖీ కట్టా లి. మిఠాయిలు తినిపించాలి. అనంతరం సోదరు లిచ్చిన కానుకలు తీసుకోవాలి.
ఎన్నో విశిష్టతలు విశేషాల సమాహారం శ్రావణ పూర్ణిమ. శ్రావణ పూర్ణిమ సర్వజన పూజి తం. సర్వశుభ శోభితం.
– రమాప్రసాద్ ఆదిభట్ల
93480 06669