సనాతన ధర్మమంటూ ఒకటున్నది. దాన్ని ఎంతగా రక్షించుకోగలిగితే, అంతగా అది మన క్షేమం చూస్తుంది. ‘ధర్మం’ అనేది మన జాతికి ప్రాణం. అది లేని జాతి నిర్జీవం. అది లేని ఖ్యాతి వ్యర్థం. కీర్తికేం ఎలాగైనా సంపాదించవచ్చు. డబ్బుతో, పదవితో, పెడదారితో… ఇలా ఎన్నో మార్గాలున్నాయి. మన కృషితో, చిత్తశుద్ధితో, ప్రతిఫలాపేక్ష లేకుండా వచ్చే కీర్తే నిజమైనది, శాశ్వతమైనది. అందుకుగాను ధర్మబద్ధమైన జీవితం గడపాలి. బతకడం కష్టమేమీ కాదు. ‘ఎలా బతుకుతున్నాం, ఎందుకు బతుకుతున్నాం’ అన్న ప్రశ్నలకే ప్రాధాన్యం ఇవ్వాలి. సాటి మనిషికి నమస్కరించడం మనకు సంప్రదాయం నేర్పింది. అతడిలో మంచి ఉంటే ఆ మంచిని ఆహ్వానిస్తూ నమస్కరిస్తాం. చెడు ఉంటే నా జోలికి రావద్దు అని నమస్కారం చేస్తాం. చెడునే దూరం చేసుకోవాలి కాని, ఆ చెడు ఉన్న మనిషిని ద్వేషించవలసిన పనిలేదు.
సత్యం బతకడం నేర్పుతుంది. ప్రేమ బతికించడం నేర్పుతుంది. వీటిని తన ఉచ్ఛ్వాసనిశ్వాసలుగా చేసుకున్నప్పుడు మానవ జీవనయాత్ర ఆదర్శవంతంగా సాగి చరిత్ర సృష్టించ గలుగుతుంది. సత్యనిష్ఠ కలిగినవాడు ఏ వృత్తిలో ఉన్నా శాశ్వత కీర్తిని సొంతం చేసుకోగలుగుతాడు. సత్యాన్ని మించిన సంపద లేదు. మనిషిని సంస్కారిగా తీర్చిదిద్దేది సత్యమే! బాపూజీ సత్యాన్నే తన మొదటి ఆయుధంగా చేసుకుని ఆంగ్లేయులమీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసి విజేత అయినాడు. నిజాయతీకి, చిత్తశుద్ధికి మూలం సత్యమే. సత్యంతో సంపాదించే సంపదే సుఖమిస్తుంది. ప్రేమను పంచేవాడికే ప్రేమను పొందే అర్హత కలుగుతుంది. అందుకే ఇచ్చి పుచ్చుకోవాలంటారు. ప్రేమే పరమాత్మ అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. మంచి ప్రేమికులను, మంచి స్నేహితులను పొందగలగడమంత అదృష్టం మరొకటి లేదు. ప్రేమను, స్నేహాన్ని పూర్తిగా అవగాహన చేసుకునేవారినే ఆ అదృష్టం వరిస్తుంది. కేవలం తనవారినే తన బంధువుల్నే ప్రేమించడం ప్రేమ కాదు. ‘ప్రపంచమంతా ఒకటే’ అన్న సత్యాన్ని అవగాహన చేసుకోగలిగేవాడే అసలైన ప్రేమికుడు. ప్రపంచానికే పుత్రుడిగా మానవుణ్ని అభివర్ణించింది వేదం. ఎన్ని శాస్త్రాలు చదివినా ‘ప్రేమ’ గురించి తెలుసుకోలేనివాడు పండితుడే కాదు అన్నాడు కబీర్‌దాసు. విశ్వహితాన్నే ప్రతి మనిషీ కోరుకోవాలి అని తపోధనులు ఏనాడో చెప్పారు. అహింస, ఆస్తేయం (దొంగిలించకపోవడం), సత్యం, బ్ర#హ్మచర్యం, అపరిగ్ర#హం (ఇతరులది ఆశించకపోవడం) అనే అయిదు వ్రతాలను మనిషి తన నిత్యకృత్యాల్లో భాగంగానే భావించాలని పతంజలి యోగశాస్త్రం స్పష్టం చేసింది. ఒంటరిగా తినరాదని, అతిథితో పంచుకొని తినడం నిత్యకృత్యంగా చేసుకోవాలని రుగ్వేదం చెబుతుంది. ఎవరికి ఎంత అవసరమో అంతే స్వీకరించాలని, ఎంతవరకు అనుభవ యోగ్యమో అంతే అనుభవించాలని ఈశావాస్య ఉపనిషత్ చెబుతోంది.
‘అన్నివైపుల నుంచీ విజ్ఞానం సంపాదించు, ఆకళింపు చేసుకో. దాన్ని అందరికీ పంచిపెట్టు. అందరికీ ఆశ్రయం కల్పించు’ అంటాడు మహాకవి కాళిదాసు. త్రికరణశుద్ధి అనేది జీవితంతో సర్వదా ముడివడిపోవాలి. రుచికరమైన పదార్థం తినడానికి ఇష్టపడినట్లే, రుచికరమైన మాట చెప్పేందుకూ సిద్ధపడాలి. కోరికైనా, కోపమైనా, లోభమైనా ఏదీ #హద్దులు దాటకూడదు. కొన్ని సందర్భాలకే అవి ఉపయోగపడతాయి. మనిషి నిరంతర విద్యార్థి, నిరంతర జ్ఞానార్థి. నిరంతర సాధనార్థి. ఇది గ్ర#హంచకుండా చేసే నిత్యకృత్యాలన్నీ వ్యర్థం. నీ దారిలో ముళ్లు పరచినవారి దారిలో మల్లెలు పరవడం నేర్చుకోవాలి. జీవించడం #హక్కు అయితే, జీవించనివ్వడం పరమవిధి! అప్పుడే జీవితానికి అర్థం, పరమార్థం.
- కామిడి సతీష్ రెడ్డి