తిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 9 నుండి 13వ తేదీ వరకు ”బాలాలయం” కార్యక్రమం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఆలయ విమాన గోపురానికి రాగి రేకులపై బంగారు తాపడం పనులు చేపట్టేందుకు ముందు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందుకోసం సెప్టెంబరు 8న ఉదయం 10.30 గంటలకు ఆచార్య రుత్విక్ వరణం, సాయంత్రం 6.30 గంటల నుండి మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, వాస్తు హోమం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సెప్టెంబరు 9న ఉదయం అకల్మష హోమం, రక్షాబంధనం, సాయంత్రం కుంభస్థాపన చేసి సన్నిధి నుంచి శ్రీ గోవిందరాజస్వామి, స్వామి వారి విమానం, విష్వక్సేనులు, జయ, విజయ, గరుడ, ధ్వజస్తంభం, బలిపీఠం కుంబాలను యాగశాలకు తీసుకొచ్చి వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సెప్టెంబరు 10న ఉదయం నేత్ర ఊన్మీలనం, పంచగవ్యాధివాసం, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపడతారు.
సెప్టెంబరు 11న ఉదయం క్షీరాధివాసం, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సెప్టెంబరు 12న ఉదయం జలాధివాసం, శ్రీ గోవిందరాజస్వామివారి బాలబింబ స్థాపన, మధ్యాహ్నం బింబవాస్తు, మహాశాంతి అభిషేకం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, శయనాధివాసం, హోత్రం, విశేష హోమం చేపడతారు.
సెప్టెంబరు 13న ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, దివ్యప్రబంధ శాత్తుమొర నిర్వహిస్తారు. ఉదయం 9.40 నుండి 10 గంటల మధ్య తులా లగ్నంలో బాలాలయ సంప్రోక్షణం చేపడతారు. మధ్యాహ్నం నిత్యకట్ల కైంకర్యం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.