Tuesday, November 26, 2024

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి 28వ అఖండ జ్యోతియాత్ర

హైదరాబాదు నుండి యాదగిరి గుట్టకు 2022 సంవత్సరం మార్చి 1వ తేది మంగళవారం ఉదయం గం॥ 9.30 ని॥ లకు
మహాశివరాత్రి పర్వదినాన హైదరాబాదు బర్కతుర చౌరస్తా సమీపంలో గల యాదగిరి భవన్ నుండి బయలు దేరుతుంది.

27 సంవత్సరాల పాటు దిగ్విజయముగా నిర్వహించబడిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి అఖండ జ్యోతి పాదయాత్ర 28వ సంవత్సరంలో ప్రవేశించింది. కీ॥శే॥ శ్రీ శ్రీ శ్రీ దైవకళా ప్రపూర్ణులు స్వామి జ్యోతిరానందుల వారి అమూల్య ఆశీస్సులతో, అనుభవజ్ఞులైన కార్యకర్తల నిర్వహణలో సాగే ఈ అఖండజ్యోతి పాదయాత్రలో ల‌క్ష‌లాది మంది భక్తులు, అనురక్తులు పాలుపంచుకోవడం, అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించడం మాటలకందని అనూహ్యమైన అనుభూతి. పన్నెండు అడుగుల ఎత్తుగల స్వామివారి, అమ్మవార్ల విగ్రహాలతో దేదీప్యమానంగా వెలిగే అఖండజ్యోతితో, ప్రత్యేకంగా అలంకరింపబడిన శఖటంపై పండిత ప్రకాండుల వేద ఘోషలు, ధార్మిక భాషణలు సాగుతుండగా శకటం ముందు భాగంములో హృదయాంగమమైన మేళ తాళాలు సుస్వరాలు మ్రోగుతుండగా దీక్షాధారులైన భక్తగణం జరిపే పాదయాత్ర అనుభవైకవేద్యం. యాత్రామార్గంలో అడుగడుగునా స్వామి వారికి, అమ్మవార్లకు భక్తులు సమర్పించే నైవేద్యాలు, హారతులు మాత్రమేకాక, రాజకీయ నాయకులు, ధార్మికవేత్తలు, సామాజిక కార్యకర్తలు ఏర్పాటు చేసి స్వాగత స్వాగత సత్కారాలు, వేడుకోలు, వీడుకోలు కార్యక్రమాలు ఒక ప్రత్యేక ఇకర్షణ. అందుకోసమే మార్గమధ్యంలో ప్రత్యేక విడిదిలో స్వామివారిని దర్శించుకునే అమూల్యావకాశం భక్తులకు కల్పించబడింది. ప్రతి సంవత్సరములాగే ఈ సంవత్సరం కూడా ఈ యాత్ర మార్చి 4వ తేది సాయంత్రానికి యాదగిరి గుట్ట చేరుకుంటుంది. ఆ రాత్రి స్వామి వారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ సమయానికి పాదయాత్ర బృంద నిర్వాహకులు అఖండ జ్యోతిని దేవస్థాన అధికారులకు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల రోజులలో ఈ అఖండజ్యోతిని అశేష భక్త బృందం సందర్శించడానికి వీలుగా దేవాలయ ప్రాంగణములోని ప్రత్యేక స్థానములో దేవాలయ అధికారులు ఏర్పాటు చేస్తారు. అదే రాత్రి హైదరాబాదు నుంచి ఊరేగింపుగా అఖండ జ్యోతితో యాదగిరి గుట్టకు వచ్చిన విగ్రహ మూర్తులను రాయగిరి చెరువులో నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేయబడుతున్నాయి. పాదయాత్రలో పాల్గొనే భక్త బృందం వారికి భోజన వసతి ఏర్పాట్లు చేస్తారు. అయితే పాదయాత్ర అనంతరం తమ తమ ప్రదేశాలకు చేరుకునే ఏర్పాట్లు మాత్రం ఎవరికి వారే చేసుకోవలసి ఉంటుంది. ఈ పాదయాత్రలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనెదరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement