తిరుమల : శ్రీవారి అనుగ్రహంతో సృష్టిలోని సకల జీవరాశులు సుభిక్షంగా ఉండాలని, అన్ని కార్యక్రమాలు సజావుగా సాగాలని కోరుకుంటూ జులై 25 నుండి ఆగస్టు 23వ తేదీ వరకు తిరుమలలో సకలకార్యసిద్ధి శ్రీమద్ రామాయణ పారాయణం జరగనుంది. కోవిడ్ – 19 కారణంగా నిలిచిపోయిన అన్ని కార్యక్రమాలు తిరిగి ప్రారంభం కావాలని స్వామివారిని ప్రార్థిస్తూ 30 రోజుల పాటు టిటిడి ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. ఇందుకోసం జులై 24న సాయంత్రం ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో అంకురార్పణ జరుగనుంది.
ఇందుకోసం వసంత మండపంలో రామాయణంలోని బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండలోని ప్రధానమైన సర్గలను పారాయణం చేస్తారు. మరోవైపు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఉదయం, సాయంత్రం వేళల్లో హోమాలు, జపాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో మొత్తం 32 మంది వేదపండితులు పాల్గొంటారు. ఒక్కో రోజు ఒక్కో కార్యాన్ని సిద్ధించాలని కోరుతూ ఆయా కాండల్లోని ప్రధానమైన ఎంపిక చేసిన సర్గలను పారాయణం చేస్తారు.
తొలిరోజైన జులై 25వ తేదీన ధర్మకార్యసిద్ధి కోసం అయోధ్యకాండలోని 21 నుండి 25 సర్గల్లో గల 221 శ్లోకాలు, జన్మాంతర సకలసౌఖ్యప్రాప్తి కోసం యుద్ధకాండలోని 131వ సర్గలో గల 120 శ్లోకాలు కలిపి మొత్తం 341 శ్లోకాలను పారాయణం చేస్తారు.