తిరుపతి : కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ ఆగస్టు 23 నుండి 27వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆగస్టు 22వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఆచార్య రుత్విక్‌వరణం, మృత్సంగ్రహణం, వాస్తు హోమం, అంకురార్పణం జరుగనుంది. కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమాలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా ఆగస్టు 23 నుండి 26వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 8.30 నుండి 10.30 గంటల వరకుయాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 23న సాయంత్రం 6 గంటలకు అగ్ని ప్రతిష్ట, కుంభస్థాపన జరుగనుంది. ఆగస్టు 24న ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు పంచగవ్యాధివాసం, సాయంత్రం 6.30 గంటలకు వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఆగస్టు 25న ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు క్షీరాధివాసం, సాయంత్రం 6.30 గంటలకు అష్టబంధనం నిర్వహిస్తారు. ఆగస్టు 26న ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు జలాధివాసం, మధ్యాహ్నం 3.30 నుండి 5.30 గంటల వరకు మహా శాంతి తిరుమంజనం, సాయంత్రం 6.30 గంటలకు శయనాధివాసం, విశేష హోమాలు జరుగనున్నాయి.
ఆగస్టు 27న ఉదయం 7 గంటలకు మహా పూర్ణాహూతి, విమాన సంప్రోక్షణ, గోపుర సంప్రోక్షణ, ఉదయం 8 గంటలకు అవాహన ప్రోక్షణ జరుగుతుంది. సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు కల్యాణోత్సవం, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయంలో ఊరేగింపు నిర్వహిస్తారు.