విడువుము మనసా వీరిడి చేతలు
తడయక శ్రీహరి తలచవో యికను || విడువుము మనసా ||
నానాడే యెనబది నాలుగు లక్షల
యోనుల వెడలితి నొక్కడనే
ఆనిన భోగములు అందలివేపో
కానము యిక నేమి గడియించేము || విడువుము మనసా ||
నలుగడనటు పదునాల్గు లోకములు
వెలయ జొచ్చితిని వేడలితిని
కలిగిన దేదో కలుగని దేదో
తెలియదేమిటికి తిరిగేమో || విడువుము మనసా ||
భువిలో చేసితి పుణ్యము పాపము
కవిసియా ఫలము గైకొంటిని
యివల శ్రీ వేంకటేశుడు యింతలో
తవిలి యేలగా ధన్యుడనైతి || విడువుము మనసా ||