మారి గొలిచియు మరి అపరములా
తిరముగ అతనినే తెలియుటగాక || మారి గొలిచియు మరి ||
పంకజనాభుని పాదములు తలచి
యింకా మరియొక ఇతరములా
అంకెల నతనినే అతని దాసులనే
కొంకక నిజముగ కొలుచుట గాక || మారి గొలిచియు మరి ||
పన్నగశయనుని బంట్లకు బంటై
కొన్నిటిపై మరి కోరికెలా
యిన్ని కోరికలు ఇవియే తనకని
కొన్నది కోలై కోరుట గాక || మారి గొలిచియు మరి ||
వీనుల వేంకట విభు నామామృత
మూనిన మతి మరియును రుచులా
తేనెలు కారెడి తీపులతని నుతి
నానా రుచులై ననుచుటగాక || మారి గొలిచియు మరి ||