Saturday, November 23, 2024

హిందూ వివాహం సనాతన వరం

దానాలలో కన్యాదానం మహత్తరమైనది. జన్మనిచ్చి, అల్లారు ముద్దుగా పెంచి, విద్యాబుద్ధులు నేర్పించి బాధాతప్త హృద యంతో కన్యను వరునికి అప్పగించడంలోనే ఒక గొప్ప త్యాగం గోచరమవుతుంది. లక్ష్మీ స్వరూపమైన ఆ కన్య మరొక వంశాన్ని వృద్ది చేయడానికి గృహప్రవేశం చేస్తుంది. హిందూ సమాజ వ్యవస్థలో వివా హం ఒక గొప్ప సంస్కారం.
సనాతన వేద సంస్కృతి మానవులకందించిన ఒక మహత్తర సృష్టి కార్యం. వివాహం నుండి కుటుంబం ఏర్పడింది. కుటుంబ వ్యవస్థకు మూలం భారతదేశం. కలసి ప్రేమానురాగాలను పంచుకునేది కుటుం బం. వసుధను ఏకంచేసే భావనే కుటుంబ భావము. మానవ జన్మ షోడశ సంస్కారాలతో ప్రారంభమవుతుంది. మొదటిది గర్భాదానం కాగా చివరిది అంత్యేష్టి. గర్భాదానానికి నాంది హిందూ వివాహం. అది కేవలం శారీరక కలయిక కాదు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, భగవంతునికి కృతజ్ఞతగా మరొక జీవికి పవిత్ర మార్గం కల్పించడమే గర్భాదానం. హిందూ వివాహం మొత్తం మంత్ర పూరితమై, బీజాక్షర సంహితమై జరిగే అద్భుతమైన తంతు. వధూవరుల చేత పురోహిత బ్రహ్మ చేయించే మహిమాన్విత కార్యం. వారికి ఎప్పటికప్పుడు అర్థాన్ని, భావాన్ని తెలియజేస్తూ సాగించే మధురమైన జీవిత ఘట్టం.
మన సనాతనం అష్టవిధ వివాహాలను పేర్కొంటున్నాయి. వాటిలో మానవులకు అర్హమైనవి మూడు మాత్రమే. అవి అర్ష, దైవ, బ్రహ్మ విధానాలు. ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరుల కళ్యాణం. కలియు గ దైవం శ్రీనివాసుని నిత్యకళ్యాణం, శ్రీ సీతారాముల జగత్‌ కళ్యాణాలు దై వ పద్ధతిలో మనం నిత్యం కొనసాగించుకొనే పవిత్ర యజ్ఞాలు.
ఇక హిందూ సమాజ వివాహాలు బ్రహ్మ, ఆర్ష పద్ధతిలో కొనసాగు తున్నాయి. ఈ రెండు విధానాలు ఇంచు మించు ఒకటే. ఆర్ష పద్దతిలో గోపూజ ఉంటుంది. లక్ష్మీ స్వరూపమైన కన్యను, విష్ణు స్వరూపుడైన వరునికిచ్చి కన్యాదాన చేయడమే వివాహం. కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుని కన్యను వరునికిచ్చి పాణిగ్రహణం చేయ డమే కళ్యాణం. వివాహానంతరం వరుడు గృహస్థుడు, వధువు గృహి ణిగా రూపొందుతారు. సనాతన ఆశ్రమాలలో గృహస్థాశ్రమం మహో న్నతమైనది. సకల ఆశ్రమాలకు ఆశ్రయాన్నిచ్చేదే గృహస్థాశ్రమం. పవిత్ర కన్యాక్షేత్రమున బీజాంకురార్పణ జరిగే ఆనంద నిల యమే గృహము. కుటుంబ ఆశలు, ఆశయాలు, సంతోషాలు, కష్ట సుఖా లను పంచుకునే దేవాలయమే గృహము.
ఆదిత్యుని ప్రతి రూపమైన అగ్నికి ఆజ్యాన్ని నైవేద్యంగా సమర్పించి చేసే వధూవరుల సప్తపది ప్రదక్షిణం ఒక మిధున ప్రతిజ్ఞ. సప్తపది లో పఠించే వేద మంత్రాలు జీవన సౌరభాలు… సప్త సోపానాలు. శుభ ముహూర్తంలో వెలువడే మంత్రాలు వధూవరుల మనోఫల కంపై సావధానంగా ముద్రవేస్తాయి. ”ధర్మేచ, అర్థేచ, కామేచ, నాతి చరామి” ధర్మార్థ కామాలలో నీకు తెలియకుండా నేను ఏ కార్యము తల పెట్టనని వరుడు ప్రతిన పూనితే, ” ధర్మేచ, అర్థేచ, కామేచ తుభ్యం ప్రజా సహత్య ధర్మభ్య: ప్రతి పాదయామి” ధర్మార్థ కామ మోక్షాల్లో నిన్ను అనుసరించి గృహస్థ ధర్మాలను నిర్వహిస్తానని, నీవు కూడా నాతో అలా గే నిర్వహించాలని వధువు సమప్రతిన చేస్తుంది.
”సఖా! సప్త పదాభవ” అని వధువు యొక్క కనిష్ట అంగుళీయము నకు వరుడు సంధానము చేసి సప్తపదికి దారి చూపుతూ ఏడడుగులతో నాకు జీవన సఖివి కమ్మని కోరతాడు. ”సాత్వ మసి అమూహం. అమూ హ మస్మే” అంటూ సిగ్గుల మొగ్గవుతూ నీవు తడబడకుండా ఉండు, నేను తడబడకుండా నీతో కలకాలం జీవనయాత్ర చేస్తానని వధువు అనుసరి స్తుంది. సప్తపది మంత్ర రాజాలతో వివాహం పరిపూర్ణమవుతుంది. ఇం తటి మహత్తర కార్యమే హిందూ వివాహం. ఇది ఒక సామాజిక పటిష్ట నిధి. జీవన రహస్యాన్ని ఏడడుగులలో నిక్షిప్తం చేసి జీవిత సత్యాన్ని అందించిన మన ఋషులకు సదా కృతజ్ఞులమై ఉండడం మన విధి. నిండు నూరేళ్ళు నిర్దేశిస్తున్న హైందవ వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చే ఏకైక మహత్తర కావ్యం. పాశ్చాత్యులు సైతం ఆకర్షితులై పాటిస్తున్న విధానం. కానీ మన దేశంలోని యువత మాత్రం కొంతవరకు హిందూ వివాహాన్ని అర్థం చేసుకోవడం లేదు. దానికి కారణం వివాహ మంత్రాలకు భావం తెలియ కపోవడము, సంపాదనే సంసారంగా భావించడము. ఆర్థిక స్వావలంబ న అవసరమే! కాని అదే సర్వస్వము అనుకుని దాంపత్య ఫలాలను ఆస్వాదించడం లేదు. మరొక నూతన పోకడ, పాశ్చాత్య నాగరికత పట్ల ఆకర్షణ. వివాహాన్ని కూడా ఒక ఆర్థిక బంధంగా చూడడం. పరస్పర ప్రేమానురాగాలకంటే అహంకార పూరిత భావజాలాన్ని నింపుకోవడం.
భార్యాభర్తల మధ్య స్వార్ధ పూరిత ఆలోచనలకు తావు లేదు. ధర్మార్థ సాధనతో ఇరువురూ సంపదలు పెంచుకోవడంలో తప్పులేదు. కానీ అదే రీతిలో ఆప్యాయతను అందరితో పంచుకోవడం కూడా ముఖ్యం. సౌహార్ధ్ర హృదయాలతో కుటుంబ సభ్యులను ఆదరించాలి.
యువతీయువకులు తమ వ్యక్తిత్వాలను అన్నివిధాలుగా పవిత్రం గా ఉంచుకుని వివాహం అనే మహిమాన్విత బంధంతో ఒక్కటవ్వడమే మన సనాతన సంస్కృతి. సంసారంలో చిన్నచిన్న కోపతాపాలు రావ డం సహజం. ఆవేశాలకు పోక మధుర క్షణాలను గుర్తుకు తెచ్చుకుని, ఒకరిపై ఒకరు నమ్మకంతో పెద్దల మాటలు వింటూ ఆనందంతో ముం దుకు సాగాలి. అన్నింటికంటే ముఖ్యమైనది సీతా రాముల దాంపత్యాన్ని ఆదర్శంగా తీసుకోవడం. ఏకపత్నీ వ్రతాన్ని భార్యాభర్తలు ఇరువురు పర స్పరం అనుసరించడం. జీవితంలో మాధుర్యాన్ని ఆస్వాదించడమంటే వివాహానికి ముందు మనోవాక్కాయ కర్మలను పవిత్రాతి పవిత్రంగా నుంచుకొని పెద్దలు చూపిన బాటలో తమకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకుని వివాహమనే యజ్ఞంలో కలవడం. తొలి తీపి జ్ఞాపకాలను ఇరువురూ నూరేళ్లూ పదిలపరచుకోవాలి. అదియే అసలు సిసలైన ఆనం దానుభూతి. అంతేకాని క్షణికమైన ఆవేశాలకు లోనయితే జీవితంలో నెమరు వేసుకోవడానికి ఏమీ మిగలదు. హిందూ వివాహానికున్న ప్రాముఖ్యాన్ని, విలువను నేటి యువత గుర్తించి, తల్లిదండ్రుల మాటలకు విలువనిచ్చి భావితరాలకు ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం. మన భారతీయ సంస్కృ తి మకుటాయమానమైన హిందూ వివాహ వ్యవ స్థను ప్రపం చానికి ఆదర్శంగా నిలుపుదాం.

– వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు
8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement