తులసీ దాస సదా హరి చేరా!
కీజై నాథ హృదయ మహఁ డేరా!!
తులసీదాసు ఎప్పుడు హనుమకు దాసుడే, సేవకుడే, శిష్యుడే! మనసున ఉండేది ఎప్పటికైనా మరపే! మరపు ఎరు గని, మాపు తెలియని మారుతి, తులసీదాస హృదయంలో నిత్య నివాసిగా ఉండమని, తులసీదాస్ ప్రార్థన. హనుమాన్ చాలీసా చదివే, పారాయణం చేసే ప్రతి ఒక్కరూ తులసీదాస్ కాగలిగితే వారి ప్రార్థన కూడా ఇదే!
హృదయము ఆత్మస్థానం. అది జీవుడి ఆరామస్థలి. అది గుహ. మనసుకు పుట్టినిల్లు. అది చరాచరమయము, శ్రీమయము, వాగ్మయము. జ్యోతిర్మయము.అంగుష్ట మాత్ర పురుషోత్తమ స్థానము హృదయము. ప్రాపంచికంగా జరిగే మానవ జీవితం ఒడిదుడుకుల ప్రయాణం. సాధన ద్వారా జీవుడు చేరవలసిన స్వస్థానము, నిజస్థానము, అదే హృదయ స్థానము. అది ఆనంద ధామం. జీవుడు తనతో తాను కూడి ఉండవలసిన చరమ స్థానము. అదే వైకుంఠము. అదే కైలాసము. వేద ప్రామాణికమైనది, ‘ఇహమేవ!’ అంటే ఇపుడే, ఇక్కడే! అవును!
లోకమున వీడి రసము లేదు.
పవనతనయ సంకటహరన
మంగల మూరతి రూప
రామలఖన సీతా సహిత
హృదయ బసహు సురభూప్||
మంగళ స్వరూపుడవు, సంకటములను తొలగించు వాడవు అయిన వాయునందనా!
శ్రీ సీతారామచంద్ర లక్ష్మణుల, ముప్పది ముక్కోటి దేవతల సమేతముగా నా హృదయ ములో ఉండుము!
– వి.యస్.ఆర్.మూర్తి
9440603499