Saturday, November 23, 2024

హనుమాన్‌ చాలీసా-16

తుమ ఉపకార సుగ్రీవ హిఁ కీన్హా
రామ మిలాయ రాజ పద దీ న్హా
తుమ అంటే నీవు, సుగ్రీవహిఁ అనగా సుగ్రీవుడికి , ఉపకార అంటే ఉపకారము, కీన్హా అంటే చేసావు, రామ అనగా రాముని, మిలాయ అంటే కలిపితివి, రాజపద అంటే రాజపదవిని, దీన్హా అనగా ఇప్పించితివి.
పరోపకారాన్ని మించిన పుణ్యంలేదు.
పరపీడనాన్ని మించిన పాపం లేదు.
ఉదాత్త వ్యక్తిత్వంలో ఉపకారం ప్రధానమైనది. ఈ సద్గుణమే పరిణామక్రమంలో సేవాభావంగా రూపుదిద్దుకుంటుంది. ఉప కారంలోనూ, సేవలోనూ స్వార్థం ఉండకూడదు. ఇతరుల శ్రేయ స్సే ప్రధానంగా, సేవ పవిత్రతను సంతరించుకుంటుంది. ఒక వ్యక్తి పట్ల చేసిన ఉపకారం, వ్యవస్థ పట్ల, దేశం పట్ల ఒక బాధ్యతగా మా రి, వ్యవహార భావనను ధర్మ భావనగా మారుస్త్తుంది. తన రాజైన సుగ్రీవుడి విషయంలోను హనుమ నెరవేర్చింది సరిగ్గా ఇదే!
రాజ్యాన్ని, రమణిని కోల్పోయిన సుగ్రీవుడు దు:ఖితుడు. నిత్యభయగ్రస్తుడు. బలశాలి అయిన తన అన్న వాలి, ఏ క్షణాన ఎటు నుంచి వచ్చి తనను హింసిస్తాడోనని సుగ్ర్రీవుడు భయం నీడలో బ్రతుకుతున్న కంపిత మనస్కుడు. ఈ విషాద సమయంలో హనుమ, సుగ్రీవుని మంత్రిగా ఉన్నాడు. సుగ్రీవుడిని ఈ మహా విపత్కర పరిస్థితి నుం డి బయటపడవేసి, అతడికి శాంతిని చేకూర్చటమే తాను చేయగల ఉపకారమని భావిస్తున్న హనుమకు, ఒక మహదవకాశం లభించింది. అదే శ్రీరామచంద్ర దర్శనం. అది సుదర్శనం. ఏ రూపాన్నైనా ధరించగల సిద్ధి, నవ వ్యాకరణ పాండితితో కలిగిన వాక్శుద్ధి, సహజ జ్ఞానము, మధురంగా మాట్లాడగల నేర్పు, శ్రద్ధ, భక్తి, వివేకము, విచక్షణ… వంటి బహుగుణ గాంభీర్యము హనుమ సంపద. శ్రీరామచంద్రుని సమీపించి, సుగ్రీవుని ధర్మ నిరతిని విడమరచి వివరించిన హనుమ, రామప్రభు హృదయాన్ని చూరగొన్నాడు. సమయానికి తగు మాటలాడిన హనుమ, ”స్వామీ! నేను వాయు కుమారుడను, వానరుడను. రా రాజైన సుగ్రీవుడు, మీ స్నేహాన్ని కోరుతున్నాడు” అన్నాడు.
హనుమ మాట తీరు, కోరిన విధం, రాముడు సుగ్రీవుడితో మైత్రిని అంగీకరించే విధంగా, ప్రథమ కలయికే ఫలప్రదం చేసింది.
రామ సుగ్రీవుల కలయిక రాబోయే కాలంలో లోక కళ్యాణకారకం అయింది. రాముడి దు:ఖము సుగ్రీవుడి దు:ఖం వంటిదే. ఆయన కూడా తన రాజ్యానికీ, రమణి సీతకూ దూరమైన వియోగ మూర్తి, నర రూపధారియైన నారాయణుడి అవతార కార్యక్రమంలో, రుద్రాంశుడైన హనుమ కర్తవ్య దీక్షకు బీజం పడిన మహత్పూర్వ పుణ్యకాలం. కనుక ఏ మాటైనా మనసులను, మనుషులను కలపగలగాలి. మాట ను వాచక యజ్ఞంగా వినియో గించాలి. ఒకరినొకరు తెలి యని రామ, సుగ్రీవులను కలిపినది, హనుమ వచో విన్నాణం. అంటే మాట్లాడగల నేర్పరితనం.
ఈ సంవిధానం బహు కీలకమై నది. ఈ రాయబార ప్రతిభే లంక లో రావణుని ముందు హనుమ ప్రదర్శించిన రాయబార చాతురి!
వి.యస్‌.ఆర్‌.మూర్తి
94406 03499

Advertisement

తాజా వార్తలు

Advertisement