జమ కుబేర దిగపాల జహఁతే
కబి కోబిద కహి సకే కహాఁతే
జయ అంటే యముడు, కుబేర అంటే కుబేరుడు. దిగిపాల అనగా దిక్పాలకులు, తే జహాఁ అంటే భూలోక వాసులైన, కబి అనగా కవులు, కోబిద అనగా పండితులు, కహా అంటే ఏ విధంగా కహి సకే అంటే ని న్ను వర్ణింపగలరు?
హనుమ మహిమను యముడు, కుబేరుడు,దిక్పాలకుటే వర్ణింపలేనపుడు, మానవమాత్రులైన కవులు, పండితులు వర్ణింపగలరా? వర్ణింపలేరని సమాధానం!
యమధర్మరాజు మృత్యుదేవత, ఆయన ఆత్మవిద్యా విశారదుడు. ఎవరి యందు ఆపేక్షకాని, ఉపేక్షగాని లేని నిర్లిప్తుడు. జీవుడిపాప, పుణ్య ఫలాలను అనుసరించి ధర్మ నిర్ణయం చేసి, శిక్షాస్మృతిని అమలు పరిచే ధర్మాధిదేవత.
అంతటి ధర్మమూర్తికి సైతం మీమాంస ఏర్పడినప్పుడు, హనుమ నామస్మరణ ప్రభావమే కొలమానమైనదని ప్రమాణం.
కుబేరుడు సంపదలకు అధిపతి. తరగని వైభవ గని, కుబేరుడు.
హనుమ వైభవ, గుణగానం ఎవరు చేస్తారో వారికి సంపదను ఉదారంగా అనుగ్రహిస్తాడని మరొక ప్రమాణం. మిగిలిన దిక్పాలకులకూ హనుమ నామవైభవమే ఆధారం.
అంతటి వారు కూడా హనుమను పరిపూర్ణంగా వర్ణించలేరు.
కేసుల వస్తు వర్ణన చేసే కవులు ఊహించి, భావించి, సం భావించి, ఉపమ, ఉత్ప్రేక్షాది అలంకారాలతో, శబ్ద జాలాలతో, పద బంధనలతో హనుమను పైపైన వర్ణించగలరేగాని, సత్య దర్శనం చేయలేరు.
ఇక పండితుల విషయం అంతే!!
ఆకాశంలో మొలిచే ఇంద్రధనువు, మన చేతికి ఎట్లా అందదో అంత తేలికగా అనుభవంలోకి రాదో, హనుమ విషయమూ అంతే!
హనుమ నామంలో ఆకార, ఉకార, మకారములు ఉన్నయ్.
అకారోకారమకారయుక్తమగు ఓంకారాభిధానమ్ము అంటాడు ధూర్జటి మహాకవి. ఓంకారం ప్రథమ శబ్దం. అది ప్రథమాక్షరం. అక్షర సమూహమంతా ఈ ప్రథమాక్షరాన్ని, ఆశ్రయించే ఏర్పడుతుంది.
ఓం అంటే ప్రథమ తలపు. అంటే నేనుతో ప్రారంభమై నేనులో నిలకడచెంది, చివరకు అసలు నేనులో లయం కావటం ప్రాణాయామం.. అదే అసలు ధ్యానం. అదే యోగం.
ఎంతటి మంత్రమైనా, ఓంకారంతో ప్రారంభం కానట్లయితే అది కేవలం మాటగా మిగిలిపోతుంది.
ఓంకారం సంకల్ప సూచి!
సంకల్ప శుభేచ్ఛగా ఉండాలి.
అది సమస్తలోకాలకు శుభదాయి.
కనుక, ఓంకారము, హనుమ భిన్నం కాదు!
వి.యస్.ఆర్.మూర్తి
94406 03499