తిరుమల : కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సెప్టెంబరు 2వ తేదీ గురువారం “బాలకాండ – సకల సంపత్ప్రదం” పేరిట ఒకటో విడత బాలకాండ అఖండ పారాయణం జరుగనుంది. నాదనీరాజనం వేదికపై ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
ఎస్.వి. వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి. వేద విశ్వ విద్యాలయం, తి. తి. దే. వేదపండితులు, తి. తి. దే. సంభావన పండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయాల అధికారులు – పండితులు – అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
బాలకాండలోని 1, 2 సర్గలు కలిపి 143 శ్లోకాలను పారాయణం చేస్తారు. ధర్మగిరి వేదవిజ్ఞానపీఠం శాస్త్ర పండితులు డా. రామానుజం శ్లోక పారాయణం చేస్తారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు డా. ప్రవ రామకృష్ణ వ్యాఖ్యానం అందిస్తారు.
ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.