”సోదరులారా! సీతారాములను ప్రజలు నిందిస్తు న్నారు. లంకానగరంలో చెరలో ఉన్న సీతను గూర్చి, జానపదులు పలువురు పలుపలు విధా లుగా మాట్లాడుతున్నారట! ఆమెను త్యజింపకుండ, ఆదరించి స్వీకరించానని, నిందిస్తున్నారట! నన్ను చులకన చేస్తున్నారట! ఏనాడు రఘువంశానికి రాని అపవాదం మూలంగా నేడు వచ్చింది. లోకాపవాద భీతి నన్ను క్రుంగ దీస్తున్నది. లోకాపవాదాన్ని నేను సహించలేకున్నాను. రఘు వంశ కీర్తిప్రతిష్టలకు కళంకం రానీయను. అందువల్ల గుండె ను రాయి చేసుకుని నేను కఠోర నిర్ణయం తీసుకొన్నాను. ఈ నిర్ణయం మీ మనస్సులను బాధింపవచ్చు!
మిమ్మల్ని కలవర పెట్టవచ్చు. లోకాపవాద పీడితులు అన్నదమ్ములైన, కన్న కొడుకులైనా, కట్టుకొన్న పెండ్లా మయిన నేను సహించలేను. త్యజించడం తప్ప దీనికి పరిష్కా రం లేదు. అందువల్ల సీతను పరిత్యజించాలని నిశ్చయిం చాను” అన్నాడు రాముడు. అన్నగారి నోటివెంట వచ్చిన పిడుగుపాటు వంటి వార్త విని సోదరులు నిర్ఘాంతపోయారు. ఏం చేయాలో వారికి పాలుపోలేదు. రాముడు లక్ష్మణుని ఉద్దేశించి ”లక్ష్మణా! నీవు రేపు ఉదయమే గంగానదీ తీర ప్రాంతంలో వాల్మీకి ఆశ్రమ పరిసరాలలో సీతను విడిచి రమ్ము. మారు మాట్లాడవద్దు. రామ బాణం వలె రాముని నిర్ణయానికి తిరుగులేదు. సీత విష యమై తర్క వితర్కాలకు నేను ఏమాత్రం అవకాశం ఇవ్వ దల్చుకోలేదు. ఈ విషయంలో భిన్నాభిప్రాయాన్ని ప్రకటిస్తే మీరు కూడ నాకు శత్రువులే అవుతారు! లక్ష్మణా! గంగాతీర తపోవనాలను చూడాలని, మునీశ్వర దంపతుల ఆశీర్వాదా లను పొందాలని సీత నన్ను కోరింది. ఇప్పుడు త్యజించడం వల్ల ఆమె కోరిక తీరుతుంది” అన్నాడు రాముడు. రామాజ్ఞ తిరుగులేనిది కదా! సోదరులు ముగ్గురు మనసులో కృంగిపోయారు. ఆ రాత్రి చాలా బరువుగా గడి చింది. నిద్ర కరువయ్యింది. లక్ష్మణుని హృదయం బరు వెక్కింది. అతని గుండె నిండుగా బాధ గూడుకట్టింది. నిద్ర లేమితో, అంతులేని వేదనతో అతని ముఖం వాడిపోయింది. రామాజ్ఞ ప్రకారం లక్ష్మణుడు రథం సిద్దం చేయమని సుమం త్రునికి చెప్పాడు.
సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. లక్ష్మణుడు తన బాధను సీత పసికడుతుందేమో అని తలవంచి, సీత వద్దకు వచ్చాడు. అమ్మా! తమరు మహరాజును ఒక కోరిక కోరారట! మీ కోరిక తీర్చమని రామాజ్ఞ! గంగా తీర తపోవన సందర్శ నార్థమై పయనించడానికి రథం సిద్ధంగా ఉంది అన్నాడు లక్ష్మణుడు. తన భర్త ఉదార వాదాన్ని తలచుకుని సీత సంబర పడింది. మునికాంతలకు సమర్పించడానికై రత్నాభరణాది కానుకలను క్షణాల మీద సిద్ధం చేసింది. సీత రథం ఎక్కి కూర్చున్న తరువాత లక్ష్మణుడు రథాన్ని అధిరోహించాడు. సుమంత్రుడు రథాన్ని కదిలించాడు. సీత కుడికన్ను అది రింది. కుడి భుజం అదిరింది. మునికాంతలను దర్శించి, వారి దీవెనలను పొందబోతున్నాను కదా! అనే సంబరంలో అపశ కునాలను సీత అంతగా పట్టించుకొనలేదు. యథాలాపంగా అపశకునాలను గూర్చి లక్ష్మణునికి తెలిపింది. లక్ష్మణుడు సర్ది చెప్పాడు. లక్ష్మణుని కన్నుల నుండి ధారా పాతంగా స్రవిస్తున్న అశ్రువులను చూసి , ”లక్ష్మణా! నా ప్రాణానికి ప్రాణమైన భర్త కూడా దు:ఖించలేదే! నీ వేమిటి? ఇలా చిన్నపిల్లవానివలె కుమిలిపోతూ ఏడుస్తున్నావేమి? మున్యాశ్రమాలను చేరి వారి ఆశీస్సులను పొంది, మునికాంతలకు కానుకలను ఇచ్చి త్వరగా నా భర్తను చేరాలని నా మనస్సు తహతహలా డుతున్నది” అనింది సీత. లక్ష్మణుడు కళ్ళు తుడుచుకొని నావను సిద్ధం చేయిం చాడు. రథ సారథి సుమంత్రుని గంగా తీరమందే నిలిపి, సీతతో పాటు నావలో ప్రయాణించాడు. వారు ఆవలి తీరం చేరారు. లక్ష్మణుడు ఉబికి వస్తున్న శోకాన్ని ఆపుకొంటూ చేతు లు జోడింంచి, గద్గద కంఠుడై ”అమ్మా! రాజాజ్ఞ ఉల్లంఘిం చలేని ఈ అభాగ్యుని మన్నింపవమ్మా! రాముడు నాకు ఈ పనిని అప్పగించడం కంటే మరణశిక్ష విధించినా నేను సంతో షంగా సీకరించే వాడిని. లక్ష్మణుని వంటి కఠినాత్ముడు మరొ క్కడు ఉండడు అనే నింద శాశ్వతంగా నా తలపై మోయవలసి వస్తున్నది. తల్లిd! నీకు సంభవింపబోతున్న ఈ దురవస్థకు నేను కారణం కాదు. నా దోషం ఆవగింజంత కూడ లేదు” అంటూ భోరుమని ఏడ్చాడు.
లక్ష్మణుడు అతి ప్రయత్నం మీద దు:ఖాన్ని దిగమ్రింగు కొన్నాడు. అతడు నోరుతెరిచి ”అమ్మా నిన్ను గూర్చి పల్లి యులు నిందిస్తూ మాట్లాడు కొన్నారట! రావణుని చెరలో ఏడాది పాటు ఉన్న సీతను రాముడు మరల భార్యగా స్వీక రించి ఏలు కొంటున్నాడు అని జానపదులు పదే పదే నింది స్తున్నారట! ఈ వృత్తాంతం విని రాముని గుండె బద్దల య్యింది. లోకాపవాదాన్ని సహింపలేక, రఘు వంశ కీర్తి ప్రతిష్టలకు కళంకం కలగడానికి ఇచ్చగింపక, రాముడు నిన్ను పరిత్యజించాలని, కఠోర నిర్ణయం తీసుకున్నాడు. తన ఆజ్ఞను పాటింపుమని ఈ మంద భాగ్యుని ఆజ్ఞాపించాడు. కేవ లం లోకాపవాదమే కాని మరొక కారణం లేదని రాముడు నీకు తెలుపుమన్నాడు. గంగా నది తీరంలోని తపోవనాల సమీపంలో నిన్ను విడిచి రమ్మన్నాడు. తల్లి!ఇక్కడికి సమీ పంలో వాల్మీకి ఆశ్రమం ఉంది. దశరథునికి వాల్మీకి మాననీ యుడే కాక మిత్రుడు కూడా. అతడు కరుణా పరాయణుడు. తల్లి ఆ మహాత్ముని ఆశ్రమంలో నీవు సురక్షితంగా ఉండ గలవు” అన్నాడు.
సీతా లక్ష్మణుని మాటలను విని దిగ్బ్రాంతు రాలైంది. దురదృష్టాన్ని తలచుకుని తన్ను తాను నిందించుకుంది. కష్టాలు పడటానికే దేవుడు నన్ను పుట్టిచ్చినట్లున్నాడు. ప్రారబ్ద కర్మఫలం అనుభవింపక తప్పదుకదా! ఇది స్వయంగా రాముడు కల్పించిన వియోగం! ఈ దుఖ: సముద్రాన్ని నేను ఎలా తరింపగలను? ఎలా జీవింవపగలను? నాకు ప్రాణా లపై అడగంటింది. గంగానదికి నన్ను సమర్పించుకోవాలని అనిపిస్తుంది. కాని రఘువంశ వారసుని మోస్తున్నానే! నేను ఆ దారుణ మరణాన్ని ఎలా ఆహ్వానించగలను? రాజాజ్ఞ అను ల్లంఘనీయం కదా! నీవు భృత్య ధర్మాన్ని నిర్వర్తించావు. ఇందులో నీ దోషం ఏముంది? ఇది నా దౌర్భాగ్యం! నీవేమి చేయగలవు? నీవు బాధపడవద్దు” అని పలికి, రామునికి తన సందేశాన్ని తెలుపుమనింది.
”అత్తలకు అందరికీ మ్రొక్కితిని అనుము. మహారాజు నకు నా మాటలను తెలుపుము. రాఘవా! అపకీర్తి పాలవుతా నని నీవు నన్ను త్యజించావు. నీపై పడిన నిందను నేను తొల గింపవలసి ఉన్నది. నన్ను అనాథను చేశావు. ఇది కీర్తి పద మా! నిండు చూలాలు అనే కనికరం కూడ చూపకుండ కేవ లం లోకోపవాద భీతితో భార్యను త్యజించాలి అనే సంకల్పం నీకు కలగడం దైవ నిర్ణయం! నిన్ను ఎలా తప్పు పట్టగలను? ” నా అదృష్టం ఈ పాటిది” అని క్రుంగిపోవడమే తప్ప మరేమి చేయలేని నిస్సహయరాలిని. కోసల రాజ్య ప్రజలను నీ సోద రులవలె భావిస్తూ, ప్రీతితో గారవింపుము. ఇది నీకు కీర్తికరం కదా! భ ర్త అనతి దాల్చుట భార్య కర్తవ్యం! ఇది నా తల్లిదం డ్రుల ద్వారా నేను తెలుసుకొన్న సతీధర్మం! పతియే ప్రత్యక్ష దైవం కదా! నా దైవమైన పతి ఆజ్ఞ ను పాటించకుండ ఉండ గలనా? ఈ నా సందేశాన్ని మహరాజునకు విన్నవించవయ్యా లక్ష్మణా” అనింది సీత.
వాల్మీకి సీతను చూసి ”అమ్మా! నీవు ఎవరో! ఏ పరిస్థితులలో ఇక్కడికి చేరావో! నా తపశ్శక్తితో గ్రహించాను. నీవు అత్యంత పవిత్రురాలివి అని కూడా నాకు తెలుసు. నీవు నా ఆశ్రమంలో నా ఆశ్రయంలో సురక్షితంగా నిశ్చింతగా ఉండగలవు! నా ఆశ్రమాన్ని నీ పుట్టిల్లు వలె భావింపుము. ముని కాంతలు వాత్సల్య పూరితులై మాతృభావంతో నిన్ను ఆనందింపగలరు!” అని ఓదార్చాడు.
వాల్మీకి సీతను ఆశ్రమానికి కొనిపోయాడు. ”ఈమె సీతాదేవి పరమ పతివ్రతా శిరోమణి. శ్రీ రామచంద్రుని ఇల్లాలు. విధి నిర్ణయమున రామాజ్ఞను పాటించడానికై మన ఆశ్రమానికి వచ్చింది. మీరు వాత్సల్యపూరితులై కన్న బిడ్డ వలె సీతాదేవిని అనుసరించండి” అని వాల్మీకి ముని కాంతలకు చెప్పాడు.
సీతాదేవి వాల్మీకి ఆశ్రమానికి చేరింది అని తెలుసుకుని లక్ష్మణుడు నిట్టూర్చి పరితపించాడు.
కె. ఓబులేశు
9052847742