రాక్షస సంచారం లేని ప్రదేశం ద్వారా హనుమంతుడు లంకా ప్రవేశం చేశాడు. శత స్థానాలలోకి దొడ్డిదారి (అద్వారం) నుండే ప్రవేశించాలన్నది రాజనీతి. హనుమంతుడదే పనిచేసాడు. శత్రు దేశంలోకి ప్రవేశించేటప్పుడు ఎడమకాలు ముందుంచాలి కాబట్టి హనుమంతుడు ఆ పద్ధతినే అనుసరిస్తాడు. రాచబాటకు చేరిన హనుమంతుడు, లంకను నలుదిక్కుల నుండి చూసి, దాని బహుముఖ ఐశ్వర్యానికి మురిసిపోయాడు. అలా తిరుగుతున్న హనుమంతుడికి వర్ణనాతీతమైన ధ్వనులు వినిపిస్తాయి. ధ్వనులకు తోడు, వేదా ధ్యయనం చేసేవారిని, రాక్షస వందిమాగధులను, రాచబాటల నడు మ నిల్చున్న గుంపులను, వేగులను, గర్జించే రాక్షసులను, దీక్షలో వున్నవారిని కూడా చూసాడు హనుమంతుడు. రావణాసురుడి ఇంటి ముందు, కాపలాకాస్తున్న ఆయన మూల బలగాన్నీ చూసాడు హనుమంతుడు. కమ్మని వాసనలతో కూడి వున్న రావణాసురుడి అంత:పురాన్ని చూసాడు హనుమంతుడు.
రావణుడి అంత:పురాన్ని బయటనుండే చూసి, ఆ తర్వాత లోని కి ప్రవేశిస్తాడు. రాక్షసులుండే ఇళ్ల సముదాయాన్ని కనుగొంటాడు మారుతి. అక్కడ మద్యపాన ప్రభావంతో దేహాన్ని మరిచి మాట్లాడు తూ, ఇతరులను బెదిరిస్తున్న రాక్షసులను హనుమంతుడు చూసా డు. కామావేశం వున్న స్త్రీలను, వికారమైన, విడ్డూరమైన, ఇంపైన చేష్ట లు చేస్తున్న స్త్రీలను, పె్లళ సంతోషంతో వున్న స్త్రీలను చూసాడు హనుమంతుడు. లేతవయస్సులో వున్నవారిని, చంద్రబింబం లాంటి ముఖం కలవారిని, వంకర కనురెప్పల వెంట్రుకలున్నవారిని, ఆభర ణాలు ధరించిన వారిని, మెరుపు తీగల్లాంటి ఆడవారిని చూసాడు.
తను చూస్తున్న స్త్రీలలో, రాజవంశంలో పుట్టిన, స్వసంకల్పంతో అయోనిజగా పుట్టిన సీతను మాత్రం చూడలేకపోయాడు హనుమం తుడు. సీతాదేవిని తాను వెతికిన అన్ని రహస్య ప్రదేశాల్లో ఎక్కడా చూడలేక పోయినందుకు హనుమంతుడు బాధపడ్డాడు ఆ సమ యంలో. రాక్షసుల ఇళ్లల్లో ఎంత వెతికినా, సీతాదేవిని చూడలేకపో యినందుకు చింతిస్తూ హనుమంతుడు తాను కోరిన రూపాన్ని ధరిం చి, మరింత వేగంగా, శ్రద్ధ³గా తిరిగి వెతకనారంభించాడు. సింహాల కాపలాలో నిరపాయంగా వుండే వనంలాగా, ప్రాకారంతో చుట్టబడి వున్న రావణ గృహాన్ని చూసాడు హనుమంతుడు. దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ ఇంటిని చూసి ఆశ్చర్యంతో ముక్కుపై వేలుంచుకుని దాన్నే చూడసాగాడు హనుమంతుడు.
ఇలా తిరుగుతూ రావణుడి రాక్షస నాయకులు వుండే ఇళ్లంటిలో సీతకొరకై వెతుకుతాడు హనుమంతుడు. అయినా ఫలితం కానరా లేదు. మనోహరంగా, విశాలంగా వున్న అందమైన రావణాసురుడి గృహాన్ని చూస్తాడు హనుమంతుడు. ఆ పరిసరాలలో సువాసనలు వెదజల్లే మనోరంజకమైన పుష్పక విమానాన్ని చూసిన హనుమంతు డు దాని రూపకల్పనకు ఆశ్చర్యపడ్డాడు. ఆ పట్టణంలో ఎంతసేపు తిరిగి నా, వెతుకుతున్న సీత జాడ తెలియరానందున ఏంచేయాలన్న విచారంలో పడ్డాడు హనుమంతుడు.
పుష్పక విమానం మధ్యలో, అర్ధ యోజనం వెడల్పు, యోజనం పొడవున్న రావణుడి ఇంటిని చూసి, అందులోకి పోయి, అక్కడ సీతా దేవి కనపడుతుందేమోనని వెతకసాగాడు హనుమంతుడు. మేడల నేకం వున్న రావణుడి నగరంలోని బలవంతులైన రాక్షసుల ఇళ్లలో నూ, రావణుడుంటున్న ఇంటిలోనూ, వెదికాడు మారుతి. రావణా సురుడి రక్షణలో వున్న ఆ ఇల్లు, ఇంపైన ధ్వనులతో వీనులకు, రూపా లతో కళ్లకు, త్రాగటానికి ఇంపైన వాటితో చర్మానికి, వాసనలతో ముక్కుకు, నోరూరిస్తూ నాలుకకు తృప్తి నిచ్చాయి హనుమంతుడికి. అక్కడి దీపాల కాంతి, రావణుడి దే#హకాంతి, ధరించిన బంగారపు సొమ్ముల కాంతి, కలవడంతో ఆ శాల మండుతున్నట్లు వెలుగు తోంది. అది చూసి హనుమంతుడు, ఔరా! అని మెచ్చుకుంటాడు.
ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ, చింతిస్తూ, సీతాన్వేషణ కొనసాగిస్తాడు హనుమంతుడు. అలా వెళుతుంటే రావణుడి శయ్య కనిపిస్తుంది. చిత్రమైన దాని ఆసనాలు స్ఫటికాలతో, బంగరు వైఢూ ర్యాలతో, దంతాలతో చేయబడ్డాయి. ఇంద్రుడి పానుపును మించిన రావ ణుడి మంచాన్ని చూసి ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. సర్వా లంకార శోభితంగా గడచిన రాత్రి సయ్యాటల అలసటతో కనిపి స్తున్న రావణాసురుడు ఆ పెద్ద పానుపు మీద నిద్రపోతున్నాడు. అయ్యో! ఈ పాపాత్ముడి దగ్గరకెందుకొచ్చానా అని బాధపడ్డాడు. నవ్వుముఖంతో రావణుడి కాళ్లదగ్గర నిద్రపోతున్నారు రావణుడి భార్యలందరూ.
వీరాంజనేయుడు ఓ ప్రత్యేకమైన స్థలంలో, ఏకాంతంగా నిద్రిస్తు న్న ముగ్ధ మనోహర సౌందర్యాతిశయం కల, మరో స్త్రీని గమనిస్తాడు. అలా కనిపించిన స్త్రీ పట్టపు దేవి కనుక, ఈ మూకలో కలవక వేరే ఒంట రిగా నిద్రిస్తోంది. ఆమె ముగ్ధమోహనాకృతిని చూసిన హనుమంతు డు, ”సీతను చూసితి- చూసితి”నని సంతోషంతో భుజాలు తట్టుకు న్నాడు. గెంతులేస్తాడు. ”అబ్బ ఇప్పటికి చూసాను కదా సీతాదేవిని” అనుకుంటాడు హనుమంతుడు. కుదుటపడ్డ ఆయన మనస్సు, ఈమెట్లా శ్రీరాముడి భార్య సీతాదేవవు తుందని తర్కించుకుంటుం ది. ఈమె సీత కాద”ని నిశ్చయించుకుని, మండోదరిని దాటి ఆవలికి పోయి, మద్యం సేవించే పానశాలలో వెతకడం ప్రారంభిస్తాడు.
రావణుడి అంత:పురమంతా గాలించినప్పటికీ, సీతాదేవి రూ పం, ఆమె వున్న స్థలం జాడ ఏమాత్రం తెలవకపోవటంతో చింతిం చాడు హనుమంతుడు. నిద్రలో పరవశమై వళ్లు తెలియకుండా వున్న పరస్త్రీలను చూసి పాపం చేసాననుకుంటాడు. ఇలా ఆలోచిస్తున్న హనుమంతుడి మనసుకు, తాను చేసింది తప్పా-ఒప్పా అని నిశ్చ యించి తీర్మానించగల సామర్ధ్యం- బుద్ధి మళ్లి కలిగింది. ఆడది ఆడ వారి మధ్యలో వుండక ఎక్కడుంటుందని నిష్కాముడనై, కర్తవ్యం నెరవేర్చాలి అనుకుంటాడు. ”నిష్కల్మశమైన మనస్సుతో అంత: పురమంతా శ్రద్ధతో వెతికాను- సీతాదేవి ఎక్కడా కానరాలేదు కదా” అనుకుని, పానశాలను విడిచి, అంత:పురంలో వెతకసాగాడు మళ్లి.
ఆ అంత:పురం మధ్యలో తీగలతో ఏర్పాటుచేసిన ఇండ్లలోనూ, చిత్రాలతో అలంకరించబడిన ఇండ్లలోనూ ఎంత వెతికినా సీత కన పడలేదు. ఆమె కనపడనందున ఒకవేళ మరణించిందేమోనని అను కుంటాడు. పాతివ్రత్య రక్షణకు పూనుకుని, సత్పురుషులతో స్తుతించ బడే సుగుణోపేత సీతామాత ఆత్మ#హత్య చేసుకోక పోయుండవచ్చు నేమో కాని, క్రూరుడైన రావణుడు చంపాడేమోనని అనుకుంటాడు. కాకపోతే కామాసక్తుడై తెచ్చినవాడు నయానో, భయానో, కోరిక తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు కాని, హంసించి వుండడనుకుంటాడు. ఒకవేళ భయంకర, వికార దేహాలు, ముఖాలు, కన్నులు వున్న రాక్షస స్త్రీలకు భయపడి సీతాదేవి ప్రాణాలు వదిలిపెట్టిందేమో, ఏంచేయాలి ప్పుడని ఆలోచనలోపడ్తాడు. సీతను చూడలేక సుగ్రీవుడు పెట్టిన గడువు దాటినతర్వాత, ఆయన్ను చూడడం ఏ ధర్మాన్ననుసరించి చేయాలని భయపడ్తాడు. ఒకవేళ వెళ్లినా బలవంతుడైన అతడు తన ఆజ్ఞను మీరినందుకు దండించక మానుతాడా? అని తలపోస్తాడు.
”అంత:పురంలో చూసాను, రావణాసురుడి స్త్రీలందరి మధ్య లో చూసాను. అయినా ఎక్కడా సీతాదేవి కనిపించలేదు. చేయాల్సిన కృషి అంతా చేసానే! శ్రమ వ్యర్ధమైందికదా!” అనుకుంటాడు హనుమంతుడు. వానరుల ఎదుట పౌరుషాలు పలికినందుకు- ”హనుమంతా, ఏంచేసొచ్చావు? సీతను తెస్తానంటివే? తెచ్చావా?” అని అడిగితే జవాబేమివ్వాలి? వెతికాను, కానరాలేదు అని చెప్పనా? అలా ఎలా చెప్పేది? అనుకున్న హనుమంతుడు, ఇక్కడే వుండి వెతుకుతూ వుంటే, హనుమంతుడు రావణుడి చేతిలో చచ్చిపోయాడేమోనను కోవచ్చు. అలా అనుకుని మిగిలిన వానరులు తామూ బ్రతికుండి ప్రయోజనం లేదనుకుని ప్రాయోపవేశం చేయడానికి నిశ్చయించుకో వచ్చు. ఇక్కడుండకూడదు, మరలిపోవాల్సిందే అనుకుంటాడు. పోతే నాడు పొగిడిన, శ్లాఘించిన జాంబవంతుడు, అంగదుడు, ఇతర వానర ముఖ్యులు ”ఛీ” అంటారేమోనని కూడా భయపడ్తాడు.
తానిక్కడ ఊరకనే ఉండరాదనీ, వ్యర్ధుడై వెళ్ళకూడదనీ, అధైర్య పడకూడదనీ, కార్యం ఎట్లాగైనా సాధించాలనీ, సకల కార్యాలను నెర వేర్చే ఉత్సాహాన్ని ఆశ్రయించి మళ్లి ప్రయత్నించాలనీ నిశ్చయించు కుంటాడు హనుమంతుడు. రావణాసురుడు రక్షించే అన్ని ప్రదేశాలు. పానగహాలు, చిత్రగహాలు, తోటలు, కేళిశాలలు, సందులు, గొందు లు, వీధులు, విమానాలు అన్నీ విడిచిపెట్టకుండా గాలించాలనీ ఆలో చిస్తాడు. అనుకున్నదే తడవుగా వెతకడం ప్రారంభించాడు. పోయిన చోటికే పోయి, ఎక్కినమెట్టే ఎక్కి, దిగినమెట్టే దిగి వెతుకుతాడు. ఎంత వెతికినా సీత కానరాక పోవటంతో దిగులుపడ్డాడు హనుమంతుడు.
అక్కడినుండి ప్రాకారం మీదకు చేరిన హనుమంతుడు సమస్త ప్రదేశాలలో వెతికినా వ్యర్ధమయింది కదా అని వ్యాకులపడ్తాడు. తర్వాత ఇలా ఆలోచిస్తాడు:
”సీత రావణుడింట వున్నదని ఎంతో నమ్మకంతో చెప్పాడే సం పాతి! అయినా కనపడలేదాయె! ఏంచేయాలి? సంపాతి అసత్యమా డడే? కాబట్టి ఇక్కడే ఎక్కడో సీత వుండేవుండి తీరాలి. ఎందున్నదో? రావణాసురుడికి వశపడినందున వాడామెను వీరందరిలో కలపక మరెక్కడైనా వుంచాడా? ఛీ, ఎందుకిలాంటి తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి? జనకరాజు కూతురు, శ్రీరాముడి భార్య, భూమిలో పుట్టింది, పేరు సీత… అలాంటిది కామవశురాలై దుష్టుడు, జాతివల్ల నీచుడు, దనుజుడు, క్రూరుడు, మనుష్యులను తినేవాడైన రావణు డిని ఎట్లా కామిస్తుంది? అట్టి విపరీతం ఎప్పటికీ వుండదు.”
”సీతాదేవి ఇందులేదు- అందులేదు. పోనీ రావణుడు అపహ రించుకుని ఎత్తుకొస్తున్న సమయంలో, అబల అయిన సీత నడితోవ లో పడిపోయివుండవచ్చా? అలాకాకపోతే ఆకాశమార్గాన తన్నెత్తు కుని రావణుడు పోతున్న సమయంలో, క్రిందున్న సముద్రాన్ని చూసి, పరవశించి, వశంతప్పి, దాంట్లో పడిపోయిందా? వాడి వేగా నికి ధైర్యం కోల్పోయి, వణకుతూ ఆకాశంలోనే తనువు చాలించిం దా? శ్రీరామచంద్రుడిని, పున్నమినాటి చంద్రుడినే తిరస్కరించే రీతి ముఖాన్ని, తామరపూలరేకుల్లాంటి ఆయన కళ్లను స్మరిస్తూ ప్రాణం విడిచిందా? రావణుడే భక్షించాడా? రావణ స్త్రీలు చంపారా? ఇలా పరిపరి విధాలుగా అనుకుంటాడు. రామపత్ని సీత రావణాసురుడి వశం కావడం కల్లనీ, అందు వల్ల, వాడే ఎక్కడైనా సీతను దాచైనా వుండాలి, లేదా, పతివ్రత కనుక వశపడక సముద్రంలో పడి మర ణించైనా వుండాలి అనుకుంటాడు. సీతపై అమితమైన ప్రేమ వున్న రాముడికి తాను ఏమని చెప్పాలని మధనపడ్తాడు హనుమంతుడు.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)
– వనం జ్వాలా నరసింహారావు
8008137012