Friday, November 22, 2024

సాయిబాబా ఉత్సవాలు

సాయిబాబా మతభేదాల్ని పాటించలేదనడానికి, మతసామరస్యం నెలకొనాలన్నది సాయిబాబా ఆకాంక్ష అనడానికి షిరిడిలో ఆయన నిర్వహించిన చావడి ఉత్సవం, శ్రీరామనవమిలాంటి ఉత్సవాలే సాక్ష్యాలు. వాటిలో చావడి ఉత్సవం అత్యంత ప్రసిద్ధిగాంచింది. షిరిడీలో ఒకరోజు పెద్ద వర్షం వస్తుంది. ఆ వర్షానికి మసీదంతా తడిసిపోయి, బాబాకు కూర్చునేందుకు చోటు కూడా వుండదు. భక్తులు ఆయనను ఆరోజు రాత్రికి చావడిలో వుండమని అడుగుతారు. సాయిబాబా అంగీకరించరు. కానీ భక్తులందరూ పట్టుబట్టి ఆయనను అక్కడికి తీసుకువెళతారు. ఆ రాత్రి ఆయన అక్కడే విశ్రమిస్తారు. ఆనాటి నుండి ఒక రాత్రి మసీదులోను, ఒక రాత్రి చావడి లోనూ నిద్రించేవారు సాయిబాబా. వారిని భక్తులు మసీదు నుండి చావడికి వేడుకలతో తీసుకెళ్ళేవారు. అదే క్రమంగా ఒక సంప్రదాయ ఉత్సవం అయింది. ఇది డిసెంబరు 1909 నాటికి గొప్ప చావడి ఉత్సవంగా ప్రసిద్ధి చెందిం ది. నేటికీ ఇది ప్రతి గురువారం రాత్రి పల్లకి ఉత్సవంగా జరుగుతున్నది. ప్రతి గురువారం రాత్రి తొమ్మిది గంటలకు సాయిబాబా ఆలయాల్లో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవ ఊరేగింపులోనే ”సద్గురు సాయినాథ్‌ మహారాజ్‌కీ జై” అనే నినాదాలు మిన్నుముట్టాయి. ఈ ఉత్సవంలో బాబా చేతులు పట్టుకుని మహల్సాపతి, హేమద్‌ పంత్‌, శ్యామ కర్ణ, జోగ్‌, కాకాసాహెబుతదితరులు పాల్గొనేవారు. ఈ ఉత్సవ సందర్భంగా మసీదులోనూ దీపాలు వెలిగించే వారు.
అలాగే సాయిబాబా షిరిడీలో శ్రీరామనవమి జరపాలని హిందువులను, ఉరుసు జరపాలని ముస్లింలను కోరేవారు. ఆ ప్రకారంగానే ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ అయింది. సాయిబాబా స్వయంగా ఈ ఉత్సవాల్లో పాల్గొ న్నారు. షిరిడీలో మొదటిసారిగా 1911లో శ్రీరామనవమి జరిగింది. నాటి నుండి శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. శ్రీరామనవమినాడు బాబా జన్మించారనే విశ్వాసం వుంది. కనుక షిరిడీకి పెద్దఎత్తున భక్తులు తరలి వస్తారు. బాబా పుట్టినరోజు పండుగను ఘనంగా జరుపుకునేవారు. శ్రీరామనవమి తరువాత గురుపూర్ణిమ నిర్వహణ పెద్దది. 1910 నుంచి నిర్వహిస్తున్నారు. బాబా అన్ని ఉపచారములకు అనుమతించి, వచ్చిన దక్షిణను తిరిగి భక్తులకే ఇచ్చేవారు. గురువు అండదండలు లేనిదే ఎవరూ ఏమీ సాధించలేరని బాబా ఎప్పుడూ చెప్పేవారు. కనుక గురువునే దైవంగా భావించి ఆరాధించాలన్నది బాబా నిర్దేశం. ఇందుకు అనువుగానే గురుపూర్ణిమ ఉత్సవాలు ఘనంగా జరిపేవారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement