Friday, November 22, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

52. పాలుంబువ్వయు( బెట్టెదంగుడువరా పాపన్న! రా యన్న లే
లే లెమ్మన్న, నరంటిపండు కొని తే, లేకున్న నే నొల్ల నం
టే లాలింపరెతల్లిదండ్రులపుడట్లే తెచ్చి వాత్సల్య ల
క్ష్మీలీలావచనంబులంగుడుపరా? శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, పాపన్న- ఓ చిన్ని బాలుడా!, పాలున్ – బువ్వయున్ – పాలు అన్నము, పెట్టెదన్ – పెడతాను, కుడువరా – తినరా!, అన్న! – తండ్రీ!, రా – రమ్ము, లే, లే, లెమ్ము – అన్నన్ – లేచి రా! అంటే, అరంటి పండు – అరటి పండుని, కొని తే – తీసుకొని రా, లేక – ఉన్నన్ – లేనట్లయితే, నేను – ఒల్లన్ – నేను ఒప్పుకోను ( అన్నం తినను), అంటే – అనగా, అపుడు – అ సమయంలో, తల్లిదండ్రులు – జననీజనకులు, అట్లు – ఏ – కోరిన విధంగానే, తెచ్చి – తీసుకొని వచ్చి, లాలింపరు – ఏ – బుజ్జగింపరా?, వాత్సల్య – ప్రేమ అనే, లక్ష్మీ – సంపదతో కూడిన, లీలావచనంబులన్ – ఆదరవాక్యాలతో, కుడుపరా? – తినిపించరా?

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! తల్లితండ్రులు చిన్నపాపని పాలు అన్నం పెడతాం, తిను! అంటే, ఆ బాలుడు అరటిపండు తెచ్చి పెడితేనే తింటాను, లేకపోతే తినను అంటే జననీజనకులు సరే నని అరటిపండే తెచ్చి పెట్టి, ప్రేమతో, ఆదరంతో లాలించి, బుజ్జగించి తినిపించరా? తినిపిస్తారు కదా! అదేవిధంగా నీ విచ్చినవి నాకు నచ్చకపోతే నాకు నచ్చినవి వాత్సల్యంతో ఇవ్వవచ్చును కదా! అని భావం.

విశేషం:
ధూర్జటి పేచీ పెట్టే బాలుడి కథ చెప్పాడు. తనదీ, శివుడిది బిడ్డకి, తండ్రికి ఉండే బంధ మని ఇంతకు ముందే నొక్కి వక్కాణించాడు. అంటే, అన్యాపదేశంగా తనకి కావలసిన దాన్ని సూచిస్తున్నాడు. శివుడు తనకి ఇచ్చిన ఇహలోక భోగాలకి తృప్తి పడక, బాలుడు అరటిపండుని కోరినట్టు తాను భవబంధమోచనం కావాలని కోరుతున్నాడు. తల్లితండ్రులు వాత్సల్యంతో బిడ్డ కోరినది ఇచ్చినట్టే శివుడు కూడా తనకి మోక్షం ప్రసాదించాలని భావం. దానికి అర్హత ఏమంటే శివుడి వాత్సల్యమే. పెద్దలకి పిన్నల పట్ల, భగవంతుడికి భక్తుడి పట్ల ఉన్న ప్రేమని వాత్సల్యం అంటారు.

డాక్టర్ అనంతలక్ష్మి


Advertisement

తాజా వార్తలు

Advertisement