Tuesday, November 26, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 22

22.రాజర్థాతురుడైనచోనెచటధర్మంబుండు? నేరీతి నా
నాజాతి క్రియ లేర్పడున్? సుఖము మాన్యశ్రేణికెట్లబ్బు? రూ
పాజీవాళికినేది దిక్కు? ధృతి నీ భక్తుల్భవత్పాద నీ
రేజంబుల్భజియింతురేతెఱగునన్? శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా! రాజు – ప్రభువు, అర్థ – ఆతురుడు – ఐనచో – ధనానికి ఆశపడేవాడైనట్లైతే, ధర్మంబు – ధర్మము, ఎచ్చటన్ – ఉండున్ – ఎక్కడ ఉంటుంది? ( అనగా ఉండదని భావం), ఏ రీతిన్ – ఏ విధంగా, నానా – జాతి – క్రియలు – వివిధ ( నాలుగు) వర్ణధర్మాలు, ఏర్పడున్? – స్థిరపడతాయి? మాన్యశ్రేణికిన్ – గౌరవించదగిన పెద్దల సముదాయానికి, సుఖము – హాయి, ఎట్లు – ఏ విధంగా, అబ్బున్ – లభ్యమౌతుంది?/ కలుగుతుంది?, రూపాజీవ – ఆళికిన్ – వేశ్యలు మొదలైన వారికి, ఏది దిక్కు – దిక్కు ఎవరు?, ధృతిన్ – ధైర్యంతో, నీ భక్తుల్ – నీ భక్తులైనవారు, భవత్ – నీ యొక్క, పాదనీరేజంబుల్ – పాదపద్మములను, ఏ తెఱగునన్ – ఏ విధంగా, భజియింతురు? – సేవించగలుగుతారు? ( ఇవన్నియు సాధ్యం కావని భావం)

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! రాజు ధన సంపాదనలో నిమగ్నుడై ఉంటే (ధనము నందున్న ప్రీతితో పరిపాలన సరిగా చేయ నట్లయితే) రాజ్యంలో ధర్మం ఎట్లా ఉంటుంది. వర్ణధర్మాలు సరిగా నడవటం జరుగుతుందా? గౌరవించదగిన సత్ప్రవర్తనకలవారికిసుఖముంటుందా? వేశ్యలు మొదలైన వారికి దిక్కేది? నీ భక్తులు ధైర్యంగా నీ పాదపద్మాలనిఎట్లాసేవించుకోగలుగుతారు? ( ఏదీ సవ్యంగా సాగదు అని అర్థం.)

విశేషం:
రాజుల మీద ధూర్జటికి సదభిప్రాయం పోవటానికి గల కారణం ఈ పద్యం తెలియ చేస్తుంది. రాజు ధర్మమార్గంలో పరిపాలన చేస్తేనే రాజ్యం – అంటే ప్రజలు సుభిక్షంగా ఉంటారు. అట్లా కాక రాజు పరిపాలన ప్రక్కకి పెట్టి, ధనం సంపాదించటంలో మునిగిపోతే ( ధనం భోగాల కోసం మాత్రమే అని ధూర్జటి అభిప్రాయం) రాజ్యం అస్తవ్యస్త మౌతుంది. ధర్మం ఉండదు. వర్ణధర్మాలు ఉండవు. గౌరవప్రదంగా జీవనం కొనసాగించటానికి వీలు కాదు. భగవత్సేవకు అసలే అవకాశం ఉండదు. మఱి, ఈ రెండు అంశాలు ధూర్జటి వంటి భక్తకవికి బాధ కలిగించేవే కదా!
రూపాజీవాళి గురించి చెప్పటంలో ఆనాడు వేశ్యలకు సంఘంలో ఉన్న గౌరవం ఎటువంటిదో తెలుస్తుంది. అంతేకాదు, ధూర్జటికి వారిపై ఉన్న అభిమానాన్ని కూడా సూచిస్తుంది.

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి

ఇది కూడా చ‌ద‌వండి : శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 21

Advertisement

తాజా వార్తలు

Advertisement