10. నిప్పై పాతకతూలశైల మడచున్ నీ నామము న్మానవుల్
దాపున్ దవ్వుల విన్న నంతక భుజా దర్పోద్ధత క్లేశముల్
తప్పుం దీరును ముక్తులౌదురని శాస్త్రంబు ల్మహాపండితుల్
చెప్పంగా దమకింక శంక వలెనా శ్రీకాళహస్తీశ్వరా!
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! నీ నామము పాపములు అనే ప్రత్తి కొండాలని నాశము చేస్తుంది. మానవులు నీ నామాన్ని దూరం నుండి విన్నా సరే యముడి భుజగర్వం వలన కలిగిన గొప్ప కష్టాలు ( నరక బాధలు) తప్పి పోవటమే కాదు, విన్న వారు మోక్షాన్ని పొందుతారు అని శాస్త్రాలు, అవి చదివిన పండితులు కూడా చెపుతున్నారు. మనుషులకు ఇంకా సందేహం ఎందుకు? ( అనగా నామస్మరణ చేయటం ఇంకా ఎందుకు మొదలు పెట్టరు? అని భావము.
విశేషం: ఇందు నామ స్మరణ గొప్పరాణాన్ని గురించి చెప్పబడింది.
పాతకములు అంటే నిష్కృతి లేని గొప్ప పాపాలు, దుష్కర్మలు.
కావాలని కాక పోయినా , పొరపాటుగా నైనా తాను అనక పోయినా, ఎవరైనా అంటుంటే విన్న సరే. నరక బాధలు తొలగి ముక్తి లభిస్తుందిట. మరి, ఇష్టంతో త్రికరణశుద్ధితో నామజపం చేస్తూ, వింటూ ఉంటే ఫలితం ఎంత ఉంటుందో దీనిని బట్టి ఊహించ వచ్చును.
ఇది కూడా చదవండి : శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 9