Saturday, November 23, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3

3. అంతా మిధ్య తలంచి చూచిన నరుండట్లౌ టెఱింగిన్ సదా
కాంతల్ పుత్రులు నర్థముల్ తనువు నిక్కం బంచు మొహార్ణవ
భ్రాంతిం చెంది చరించు గాని, పరమార్థంబైన నీ యందు( దా
జింతాకంతయు( జింత నిల్పదు గదా, శ్రీకాళహస్తీశ్వరా!

తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! ఆలోచించి చూస్తే అవగత మయ్యేది ఈ జగమంతా మిధ్య, లేక మాయ అని. ఈ సంగతి తెలియని వారు లేరు. కాని, మానవుడు ఈ సంగతి తెలిసి కూడా నిరంతరము భార్య, పిల్లలు, ధనములు, తన శరీరము శాశ్వతమైనవి అని భావించి మోహము అనే సముద్రములో పడి, భ్రమ లో జీవిస్తాడే కాని, జీవిత పరమార్థమైన నీ పై స్వల్పమైన ధ్యానమునుకూడా నిలపడు కదా ! ఎంత అజ్ఞానం!
విశేషం: ధూర్జటి మానవుల అజ్ఞానానికి బాధ పడటం ఈ పద్యంలో కనపడుతుంది. తోటిజీవులపై దయ, జాలి, భక్తులకు ఉండవలసిన లక్షణాలు. తన కిప్పుడు జ్ఞానోదయం అయింది కాని, అంతకు ముందు తాను కూడా ఇటువంటి జాలి పడవలసిన స్థితిలో ఉన్న వాడే. చరాచర జగత్తు అంతా మిథ్య అని తెలియని దెవరికి? దృశ్యమాన ప్రపంచము “ నిరంతర పరిణామశీల” మని మార్పుచెందే బాహ్య రూపము వెనుక తాను మార్పు చెందక మార్పుని కలిగిస్తూ ఉండే తత్త్వమే “ పరబ్రహ్మ” లేక “ పరమాత్మ” అని తెలియక పోవటమే భ్రమ చెందటం, మాయకి లోనవటం. గుర్తించిన క్షణాన సమస్తంలో వ్యాపించిన ఈవనుభూతిస్వరూన్ని చెందటం జరుగుతుంది. అప్పుడు బాహ్యరూపాలు భగవదనుభూతికి అంతరాయం కలిగించవు.
ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే నాలుగు పురుషార్థాలు మానవుడు లౌకిక జీవనంలో సాధించ వలసిన ప్రయోజనాలని తెలియబరుస్తాయి. ఈ నాలుగింటిని అతిశయించిన, నాలుగింటికి లక్ష్యమయిన పురుషార్థం భక్తి. అదే పరమార్థం.

డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి

ఇదికూడా చదవండి : శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 2

Advertisement

తాజా వార్తలు

Advertisement