2. వాణీవల్లభ దుర్లభంబగు భవ ద్ద్వారంబున న్నిల్చి ని
ర్వాణ శ్రీ జెఱ పట్ట ( జూచిన విచార ద్రోహమో , నిత్యక
ల్యాణ క్రీడల( బాసి, దుర్దశల పాలై రాజలోకాధమ
శ్రేణి ద్వారము దూర( జేసి తిపు డో శ్రీకాళహస్తీశ్వరా.
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! తారతమ్యము లెఱుగక, బ్రహ్మాదులకు కూడా దుర్లభమైన నీ ఇంటి వాకిట నిలబడి, ముక్తికాంతను చెఱబట్టి (బలవంతముగా తీసుకొని, అర్హత, అనర్హతల గురించి ఆలోచింపక) తీసికొని పోదామని అనుకున్న, నా ఆలోచన లోని ద్రోహబుద్ధికి ఫలితమై యుండ వచ్చును, సర్వశుభప్రదములైన నీ సేవాభాగ్యమునకు దూరమై, నీచులై రాజుల గుమ్మములలో ప్రవేశించునట్లు చేశావు.
విశేషం: తాను రాజాస్థాన ప్రవేశాన్ని కోరటం కూడా ఈశ్వరవిలాసమేనట. కాని, దానికి కారణం మాత్రం తన దురాశ యట. మోక్ష మన్నది భగవంతుడి అనుగ్రహం వలన సిద్ధించునదే కాని, మానవులు తాము స్వయంకృషితో సంపాదించా మనుకొనటం సత్యం కాదు. అయినప్పుడు ముక్తికాంతను బలవంతంగా చేపట్ట దలచటం ద్రోహమే కదా. పరమేశ్వరుడి యందు భక్తి, తత్ఫలితమైన పరమేశ్వరానుగ్రహం ఉండగా ‘ ముక్తి’ అన్నది కాంక్షించటం నమ్మకద్రోహం కాదా? ఎవరి కెంత వరకు, ఏమివ్వాలి? అన్నది ఈశ్వరుడికి తెలుసు. నమ్మినపుడు సందేహించ కూడదు.
ఇదికూడా చదవండి :శ్రీ కాళహస్తీశ్వర శతకం – ముందు మాట