Saturday, November 23, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

92.
ఊరురంజనులెల్లభిక్షమిడరో? యుండన్గుహల్గల్గవో?
చీరానీకమువీధులందొరుకదో? శీతామృతస్వచ్ఛవాః
పూరంబేఱుల( బాఱదో? తపసులంబ్రోవంగనీవోపవో?
చేరం బోవుదు రేల రాజుల జనుల్శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, ఊరు – ఊరన్ – ప్రతి ఉరిలోనూ, జనులు – ఎల్లన్ – ప్రజాలందరు, భిక్షము – బిచ్చం, ఇడరు – ఓ – ఇవ్వరా? ఉండన్ – ఉండటానికి / నివసించటానికి, గుహల్ – ప్రకృతిలో సహజంగా ఏర్పడిన కొండగుహలు మొదలైనవి, కల్గవు – ఓ – లేకున్నవా? (ఉన్నాయి కదా), చీర – అనీకము – వస్త్ర సముదాయము, వీధులన్ – వీధి అంగళ్లలో, దొరుకదు – ఓ – లభించదా? శీత – అమృత – చల్లని, అమృతం లాగా తియ్యని, స్వచ్ఛ – తేట అయిన, వాఃపూరంబు – నీరు, ఏఱులన్ – సెలఏళ్లలో, పాఱదు – ఓ – ప్రవహించటం లేదా? తపసులన్ – తపశ్శాలురని, ప్రోవంగన్ – రక్షించటానికి, నీవు – నువ్వు, ఓపవు – ఓ – సమర్థుడివి కాదా? జనుల్ – ప్రజలు, రాజులన్ – రాజులని, ఏల – ఎందుకు, చేరన్ – పోవుదురు – ఆశ్రయించటానికి పోతారు?

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా!ప్రతిగ్రామంలోనూ ప్రజలు భిక్షం వేస్తారు. ఉండటానికి ప్రకృతి ప్రసాదించిన గుహలు ఉండనే ఉన్నాయి. కట్టుబట్టలుఅంగళ్ళలో లభిస్తాయి. చల్లని,తియ్యని నీరు సెలయేళ్లలో ప్రవహిస్తూ ఉంటుంది. తపస్వులను రక్షించే సమర్థుడవైన నువ్వు ఉన్నావు. అయినా, మానవులు రాజాశ్రయం కోసం ఎందుకు ప్రాకులాడతారో తెలియదు.

విశేషం:
ఇదే భావం 46 వ పద్యంలో కూడా వెలిబుచ్చాడు ధూర్జటి. అందరినీ రక్షించటానికి పరమేశ్వరుడు ఉండగా మానవులు రాజులని ఎందుకు ఆశ్రయిస్తారోనని బాధ పడతాడు ధూర్జటి.

డాక్టర్ అనంతలక్ష్మి


Advertisement

తాజా వార్తలు

Advertisement