65. ఒక యర్థంబును నిన్ను నే నడుగగా యుహింప, నెట్లైన
(బొమ్ము, కవిత్వంబులు నాకు జెందవని యేమో యంటివా? నాదు
జిహ్వకు నైసర్గికకృత్య మంతియ సుమీ! ప్రార్థించుటే కాదు
కోరికలన్ నిన్నును గాన నాకు వశమా ? శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా! ఎట్లు – ఐన్ – ఏది ఏమైనా, పొమ్ము – కానియ్యి, ఒక – అర్థంబును – ఒక్క కోరిక కూడా, నిన్ను – నిన్ను, అడగ – కాన్ – అడగటానికి (అడగాలని), ఊహింపను – తలచను, కవిత్వంబులు – నీవు చెప్పే కవిత్వాలు , నాకున్ – నాకు, చెందవు – అని – సంబంధించినవి కావా అని, ఏమి – ఓ – ఏమేమో, అంటివి – ఆ – అన్నావా? నాదు -నా యొక్క, జిహ్వకు – నాలుకకి, నైసర్గిక కృత్యము – స్వభావసిద్ధమైన పని. అంతియ సుమీ – అంతే సుమా! ప్రార్థించుట – ఏ – నిన్ను ప్రార్థించటమే కాదు, కోరికలన్ – కోరికలు కలిగి ఉండి, నిన్ను – నిన్ను, కానన్ – చూడటం, నాకు – నాకు, వశమా – శక్యమౌతుందా? ( కాదని భావం)
తాత్పర్యం
శ్రీకాళహస్తీశ్వరా! నేను నిన్ను ఒక్క కోరిక కూడా కోర దలచ లేదు. మఱి, ఈ కవిత్వాలు నా గురించే రచించావు కదా! అని అనకు. కవిత్వం చెప్పటం నా నాలికకి సహజలక్షణం. అంతే! కాని, ఈ కవిత్వం నిన్నేదో కోరటానికి కాదు సుమా! ఎందుకంటే, కోరిక లుంటే నిన్ను చూడటానికి వీలు కాదు కదా!
విశేషం:
కవిత్వం చెప్పకుండా ఉండ లేడు కనుక, జిహ్వచాపల్యంతో కవిత లల్లాడే కాని, ఏదో ఆశించి కాదు. కోరిక ఎటువంటిది ఉన్నా, భగవంతుడు కనిపించడు. భగవంతుణ్ణి చూడాలనే కోరిక ఉన్నా కాని, భగవంతుడికి, భక్తుడికి మధ్య ఆ కోరిక అన్నది అడ్డు వస్తుంది. చూడాలనే వాంఛ కూడా నశించిన తర్వాతే దర్శనం లభిస్తుంది.
కవిత్వం ధూర్జటి జీవ లక్షణమట!
డాక్టర్ అనంతలక్ష్మి