63. స్తోత్రం బన్యుల జేయ నొల్లని వ్రతస్థు ల్వోలె వేసంబుతో(
బుత్రీపుత్రకళత్ర రక్షణకళా బుద్ధిన్ నృపాలాధమున్
బాత్రం బంచు భజింప( బోదు రిదియున్ భావ్యంబె యవ్వారి చా
రిత్రం బంతయు మెచ్చ నెంచ మదిలో శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, అన్యులన్ – ఇతరులని, స్తోత్రం – స్తుతి, చేయన్ – ఒల్లనని – చేయటానికి అంగీకరించని, వ్రతస్థుల్ – పోలెన్ – వ్రతం పట్టిన వారి వలె ( ఉండి), పుత్రీ – కుమార్తెలని, పుత్ర – కుమారులని, కళత్ర – భార్యని, రక్షణ కళా బుద్ధిన్ – రక్షించటంలో నేర్పు కల బుద్ధితో, వేసంబుతోన్ – దానికి తగిన (ఆడంబరమైన)వేషధారణతో, నృపాల – అధమున్ – నీచుడయిన ఒక రాజుని, పాత్రంబు – అంచున్ – యోగ్యుడు / తగినవాడని అంటూ, భజింపన్ – సేవించటానికి / పొగడటానికి, పోదురు – వెడతారు. ఇదియున్ – ఇది (ఈ పద్ధతి), భావ్యంబు – ఎ – సరి యైనదా? మదిలోన్ – మనస్సులో, ఆ – వారి -అటువంటి వారి, చారిత్రంబు – నడవడికని, ఎన్నడున్ – ఎప్పుడు కూడ, మెచ్చన్ – మెచ్చుకోవటానికి, ఎంచన్ – ఒప్పుకోను.
తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! కొందఱు మేము ఇతరులను పొగడమనే వ్రతం పట్టినట్టు ఉండి, భార్యా బిడ్డలని పోషించట మనే కళలో ప్రవీణులై, దానికి తగిన ఆడంబర మైన వేషధారణ చేసి, నీచులయిన రాజులని తగినవాడు, యోగ్యుడు, గొప్పవాడు అని పొగడుతూ సేవించ పోతారు. ఇదేమైనా తగినదా? అటువంటి వారి ప్రవర్తనని (కపటాన్ని) నేను ఏమాత్రం మెచ్చను.
విశేషం:
వ్రతము – వర్తనం. ఈ విధంగా ప్రవర్తిస్తాను అని ఒక నియమం స్వీకరించి, పాటించటం. వ్రతాలు అని మనం చేసే వాటిలో పూజాదికాలతో పాటు, ప్రవర్తనానియమావళి కూడా ఉంటుంది. అది ఆదేశసూత్రాల లాగా కాక, కొన్ని పాత్రల నడవడిక రూపంలో మనకి అందించబడుతుంది. అందుకే ప్రతి వ్రతానికి ఒక కథ ఉంటుంది. కథని కథ లాగా కాక, వారి ప్రవర్తనల పరంగా మనం అర్థం చేసుకుంటే ఉపయోగం, అదే పరమార్థం.
డాక్టర్ అనంతలక్ష్మి