62. సంతోషించితి( జాలు రతిరాజద్వార సౌఖ్యంబులన్
శాంతిం బొందితి( జాలు బహురాజద్వార సౌఖ్యంబులన్
శాంతిం బొందెద( జూపు బ్రహ్మపదరాజద్వార సౌఖ్యంబు ని
శ్చింతన్ శాంతుడ నౌదు నీ కరుణచే శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, రతిరాజ – రతీపతి అయిన మన్మథుడి, ద్వార – వాకిలి (స్త్రీ), సౌఖ్యంబులన్ – సుఖాలవల్ల, సంతోషించితిన్ – సంతోష పడ్డాను. చాలున్ – చాలున్ – సరి సరి, బహు – అనేక, రాజద్వార – రాజులగుమ్మాల లోని, సౌఖ్యంబులన్ – సుఖాలవల్ల (రాజభోగాలవల్ల) శాంతిన్ – ప్రశాంతతను, పొందితిన్ – పొంది ఉన్నాను,చాలున్ – చాలున్ – సరి సరి, బ్రహ్మపద – మోక్షం అనే, రాజద్వార సౌఖ్యంబు – రాజమందిరద్వార మందున్న సుఖాన్ని, చూపు – ప్రసాదించు, శాంతిన్ – తాపత్రయాలు ఉపశమించిన స్థితిని, పొందెదన్ – పొందుతాను, నీ కరుణ చేన్ – నీ దయ చేత, నిశ్చింతన్ -ఎటువంటి ఆలోచన (విచారం) లేక, శాంతుడన్ – దుఃఖవిముక్తుణ్ణి, ఔదున్ – అవుతాను.
తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! స్త్రీలతో రతిసౌఖ్యాలవల్ల, రాజద్వారసౌఖ్యాల (రాజభోగాల)వల్ల సంతోషించి, తృప్తి పొంది ప్రశాంత చిత్తుడ నయ్యాను. అవి చాలు. నీవు కరుణించి మోక్షద్వార మందున్న సుఖాన్ని ప్రసాదిస్తే ఎటువంటి చింత లేక ప్రశాంతతని పొందుతాను.
విశేషం:
లౌకిక, భౌతిక భోగాలు అనుభవిస్తే విరక్తి కలుగుతుంది. ఒకదాని తరువాత మరొకటి కావా లనిపిస్తుంది. కోరికలు సముద్రంలోని అలలలాగా పుడుతూనే ఉంటాయి. కాని, ముక్తి లభించిన తరువాత – ఆ ఆనందంలో ఆలోచన ఉండదు (నిశ్చింత) కనుక కోరిక లుండవు. ఆ స్థితి కోరికలు శమించిన (అణిగిన) స్థితి. అదే శాంతి. ఆ స్థితియే కైవల్యం. అది
కావాలని కోరాడు ధూర్జటి.
డాక్టర్ అనంతలక్ష్మి