Saturday, November 23, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

58. శ్రుతులభ్యాసము చేసి, శాస్త్ర గరిమల్ శోధించి, తత్త్వంబులన్
మతి నూహించి, శరీర మస్థిరము, బ్రహ్మం బెన్నసత్యంబుకాం
చితి మంచున్సభలన్ వృథా వచనముల్చెప్పంగనే కాని ని
ర్జితచిత్తస్థిరసౌఖ్యముల్తెలియరోశ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, శ్రుతులు – వేదాలని, అభ్యాసము చేసి – అధ్యయనం చేసి, శాస్త్రగరిమల్ – శాస్త్రములలోని ఘనతలని,(గొప్పవిషయాలని), శోధించి – పరిశీలించి, తత్త్వంబులన్ – వేదాంత విషయాలని, మతిన్ – బుద్ధిలో, ఊహించి – భావన చేసి, శరీరము – దేహం, అస్థిరము – అశాశ్వతం, ఎన్నన్ – పరికించి చూస్తే, బ్రహ్మంబు – భగవత్తత్త్వమే, సత్యంబు – నిజము, (అని) కాంచితిమి – దర్శించాం, అంచున్ – అంటూ, సభలన్ – సభలలో, వృథావచనముల్ – పనికిరాని మాటలు,చెప్పంగనే కాని – చెప్పటానికి మాత్రమే, నిర్జితచిత్త – చిత్తాన్ని జయించి నందు వల్ల కలిగే, స్థిరసౌఖ్యముల్ – శాశ్వతసుఖాలు, తెలియరు – ఓ – తెలుసుకొన లేరా?

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! మానవులు వేదాలు చదివి, శాస్త్రాలలో ఉన్న విషయాలని గొప్పపరిశోధన చేసి, తెలిసికొని, వేదాంత విషయాలని బుద్ధితో భావన చేసి, శరీరం అశాశ్వతం, భగవత్తత్త్వమే (పరబ్రహ్మమే) సత్యం, శాశ్వతం అని మేము దర్శించాము అని సభల్లో పనికిరాని మాటలు పలుకుతూ ఉంటారు. కాని, చిత్తవృత్తి నిరోధం ( యోగం) వలన కలిగే శాశ్వతానందాన్ని మాత్రం తెలుసుకో లేరు.

విశేషం:
పండితుల పద్ధతిని గూర్చి వివరించాడు ధూర్జటి ఈ పద్యంలో. పాండిత్య ప్రకర్షతో తెలుసుకోటానికి, అనుభూతి పొందటానికి ఉన్న భేదాన్ని చెప్పాడు ధూర్జటి. శరీరాలు శాశ్వతం కాదని ఎవరి మరణం చూసినవారైనా చెప్పవచ్చు. కాని, శాశ్వతమైన బ్రహ్మభావననిపొందగలగటంఎట్లా అనేది మాత్రం ఎవరూ చెప్పరు. సభలలో ఇన్ని మాటలు చెప్పేవారు కూడ కనీసం మనస్సునైనా జయించరు. ఇంక వారు పొందే దేముంది?
ఈ పద్యంలో జ్ఞానానికి, అనుభవానికి మధ్య నున్న తేడా చూపించ బడింది. చక్కెర తియ్యగాఉంటుందన్నది జ్ఞానం. నాల్కపైచిటికెడు చక్కెర వేసుకుంటే తీపి అంటే ఏమిటో తెలియటం అనుభవం. తియ్యదనం గురించిన గ్రంథాలు, శాస్త్రాల కన్న చిటికెడు పంచదార తీపి గురించి అర్థ మయ్యేట్టుచెప్పేది అధికం. ఉత్తమం. పండితులది జ్ఞానమే కాని అనుభవం కాదు.

డాక్టర్ అనంతలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement