Tuesday, November 26, 2024

శ్రీశైల మల్లికార్జున సుప్రభాతమ్‌ (ఆడియోతో..)

శ్రీశైలే భ్రమరాంబికా విలసితో భద్రాసనే సంస్థిత:
రాజచ్ఛంద్రకళా వికాసితవపు స్సారంగపాణిస్సదా
శ్రీనాథాది సురేంద్ర పూజిత పదాంభోజాత మృత్యుంజయ:
పాయాచ్చ్రీగిరిమల్లికార్జున మహాదేవో మహీమండలం

తాత్పర్యము : శ్రీశైలమందు భ్రమరాంబికతో ప్రకాశించు వాడును, మంగళకరమైన ఆసనమందున్న వాడును, ప్రకాశించు చంద్రకళతో నొప్పారు శరీరము కలవాడును, చేతి యందు లేడి కలవాడును, విష్ణువు మొదలైన దేవతా ప్రభువులచే పూజిం పబడిన పాద పద్మములు కలవాడును, మృత్యువును జయించిన వాడును అగు శ్రీశైల మల్లికార్జున మహాదేవుడెల్లప్పుడును భూమండలమును కాపాడుగాక!

ఉతిష్ఠోత్తిష్ఠ గౌరీశ ఉత్తిష్ఠవృషభధ్వజ
ఉత్తిష్ఠమహిమోపేత లోకానాం మంగళంకురు

తాత్పర్యము : ఓ పార్వతీప్రియా! లెమ్ము లెమ్ము! వృషభము ధ్వజమందు కలవాడా! లెమ్ము! మహిమాన్వితుడా! లెమ్ము! లోకములకు మంగళము చేయుము.

నమస్తే నమస్తే జటాజూటగంగ
నమస్తే నమస్తే శివాలింగితాంగ
నమస్తే నమస్తే సదాశౌరిసంగ
నమస్తే నమస్తే నమస్తే గిరీశ

- Advertisement -

తాత్పర్యము : జటాజూటమందు గంగ కలవాడా! నీకు నమస్కారము! పార్వతిచే కౌగలించుకొనబడిన దేహము కలవాడా! నీకు నమస్కారము! ఎల్లప్పుడును విష్ణువుతో స్నేహము కలవాడా! నీకు నమస్కారము! గిరీశా! శివా! నీకు నమస్కారములు!

భస్మత్రిపుంఢ్ర పరిశోభిత పాలభాగ
భస్మీకృతోరు సమబాణ మనోహరాంగ
గౌరీవర త్రిదశ కీర్తిత సుందరాంగ
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : విభూతి రేఖలచే ప్రకాశించు ఫాలభాగము కలవాడా! భస్మము చేయబడిన మన్మధుని వంటి సుందర దేహము కలవాడా! పార్వతీపతీ! దేవతలచే కీర్తింపబడు అందమైన దేహము కలవాడా! శ్రీ మల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

పంచాక్షరీ పఠనమగ్న మునీంద్రసాంద్ర
కంజాక్ష మిత్ర సురోలోక మహాగణంద్ర
గంగోత్తమాంగ గజచర్మ ధరామరేంద్ర
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : పంచాక్షరీ మంత్రమును పఠించు మునీంద్రులతో కూడిన వాడా! విష్ణువుకు మిత్రుడా! దేవతా లోకమునకును, ప్రమధ గుణములకును ప్రభువా! శిరస్సు నందు గలవాడా! ఏనుగు చర్మమును ధరించిన వాడా! దేవతా సార్వభౌమా! శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

బాలార్కభాసుర శరీర కుబేరమిత్ర
శూలాయుధ ప్రమధ పుంగవ పారిజాత
హాలా హలోత్కట భయకుల దేవపాల
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : బాలసూర్యుని వలె ప్రకాశించు దేహము కలవాడా! కుబేరునకు మిత్రుడా! త్రిశూల మాయుధముగ కలవాడా! ప్రమథ శ్రేష్ఠులకు కల్పవృక్షము వంటి వాడా! హాలాహలము వలన కలిగిన భయముచే సంచలించు దేవతలను పాలించిన వాడా! శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

రాజద్గిరీశ చతురానన దర్పనాశ
మందస్మితేనగజిత శీతకర ప్రకాశ
నాగేంద్రహార నగకార్ముక నందికేశ
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : ప్రకాశించు గిరీశ్వరుడా! బ్రహ్మ యొక్క గర్వమును నాశనము చేసిన వాడా! చిరునవ్వుచే చంద్రకాంతిని జయించిన వాడా! పాములకు రాజైన వాసుకి హారముగను, మేరు పర్వతమును ధనస్సుగను కలవాడా! నందికేశ్వరా! శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

దేవాధిదేవ గురుదేవ మహానుభావ
సేవాసమాగత సురోత్తమ శాంతశీల
శ్రీమన్నిరంజన నిరీశ్వర నిర్వికార
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : దేవాధి దేవా! గురుదేవా! మహానుభావా! శాంత శీలము కలవాడా! శోభాయుక్తుడా! నిరంజనా! సర్వేశ్వరా! నిర్వికారా! దేవతా ప్రభువులు సేవించుటకు వచ్చియున్నారు! శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

వామాంగారూఢ గిరిరాజ సుతాసమేత
ప్రేమాలవాల మునిపుంగవ ముక్తిదాత:
కైలాస మందిర మహేంద్ర సురాధినేత:
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : నీ దేహము యొక్క వామభాగము నందధిష్టించిన పార్వతితో కూడిన వాడా! ప్రేమకు నిలయమా! మునీశ్వరులకు ముక్తినిచ్చువాడా! కైలాసవాసా దేవేంద్రునకును, దేవతలకును ప్రభువా! శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

గాంగేయ నిర్మిత కిరీట మణిప్రభాస
మాంగల్య నిత్య పరిశోభిత శ్రీమహేశ
గంగోదకాంచిత కమండలు శోభిహస్త
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : బంగారు కిరీటమునందలి మబ్బుల కాంతితో భాసించు వాడా! శుభముచే నెప్పుడును ప్రకాశించు వాడా! గంగా జలముతో కూడిన కమండలువుతో శోభిల్లు హస్తము కలవాడా! శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

గౌరీవర ప్రమథనాధ సువర్ణగోత్ర
దూరీకృతాఘ సురపూజ్య ముకుందమిత్ర
భూరిప్రభవ సమభావ భుజంగగాత్ర
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : పార్వతీ పతీ! ప్రమధ నాయక! బంగారు పర్వతమైన మేరువు విల్లుగా కలవాడా! దూరముగా చేయబడిన పాపములు కలవాడా (పాపములను దూరము చేయువాడా) దేవతలచే పూజింపబడు వాడా! విష్ణువునకు మిత్రుడా! అధికమైన ప్రభావము కలవాడా! సమచిత్తము కలవాడా! పాములు దేహమందు కలవాడా! శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

నందీశ వాహన నగోత్తమ సన్నివాస
గర్వోన్నత త్రిపుర దానవ సర్వనాశ
భీమత్రిశూల యమకింకర భీతినాశ
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : నందీశ్వరుడు వాహనముగ కలవాడా! పర్వతశ్రేష్ఠమైన కైలాసము నివాసముగ కలవాడా! గర్వాధికులైన త్రిపురాసులను పూర్తిగ నాశనము చేసిన వాడా! భయంకరమైన త్రిశూలము కలవాడా! యమకింకరుల మది భయమును నాశనము చేయువాడా! శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

ఆనంద తుందిల మహోత్తమ మౌనినాథ
పానంకురు ప్రమథ భక్తిరసం మహేశ
గానంశృణు త్రిదశ మంగళ సుందరీణాం
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : ఆనందముతో నిండిన ఉత్తములైన మునీశ్వరులకు ప్రభువా! మహేశ్వరా! ప్రమథగణము భక్తిరసమును పానము చేయుము. దేవతా స్త్రీల సంగీతమును వినుము. శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

హేరంబషణ్ముఖ మహోజ్జ్వల వీరభద్ర
పుత్రాన్విత ప్రణుత మానవ పారిజాత
యోగీంద్ర యోగ్య సుమనోహర యోగదండ
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, వీరభద్రుడు మున్నగు పుత్రులతో కూడిన వాడా! నమస్కరించు మానవులకు కల్పవృక్షము వంటి వాడా! యోగీంద్రులకు తగిన సుందరమైన యోగ దండము కలవాడా! శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

రుద్రాక్షదామ సమలంకృత కాలకంఠ
సద్రాజశేఖర సదాశివ వేదవేద్య
భద్రళిదాన ధరణీ రథశూలపాణ
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : రుద్రాక్ష మాలాలంకృతమైన నల్ల కంఠము కలవాడా! చంద్రుడు శిరోలంకారముగ కలవాడా! సదాశివా! వేదవేద్యా! మంగళ సముదాయుములను ప్రసాదించు వాడా! భూమియే రథముగా కలవాడా! త్రిశూల పాణీ! శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

పంచాననేతి ఫణిరాజ విభూషణతి
సంచారితార్థ విభవేతి మహేశ్వరేతి
త్వాంకీర్తయంతి విబుధా: ప్రతినిత్యమీశ
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : ఓ ఈశ్వరా! ఐదు ముఖముల కల వాడ వనియు, సర్పరాజును అలంకారముగ కలవాడవనియు, ప్రసరింపబడిన ధనవైభవములు కలవాడవనియు, మహేశ్వరుడవనియు ప్రతి దినము దేవతలు నిన్ను కీర్తించుచున్నారు. శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

నృత్యంతికేకి నికరా నిరతంతవాగ్రే
గాయంతి కోకిల గణాస్తవ దివ్యలీలా:
ఆయాతి భక్తజనతా తవదర్శనాయ
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : నెమళ్ళ సముదాయములు నీ ముందు నాట్యము చేయుచున్నవి. కోకిల గుణములు దివ్యమైన నీ లీలలను గానము చేయుచున్నవి. భక్త జన సమూహము నీ దర్శనము కొరకు వచ్చుచున్నది. శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

లోకత్రయేషు విబుధా: స్సతతం త్వదీయం
అత్యద్భుత ప్రవిమలం మహిమాంబురాశిం
ధ్యాయంతి భక్తిభరితా: ప్రమదోపగూడా:
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : దేవతలు భక్తి సంతోష భరితులై ముల్లోకముల యందెల్లపుడు అద్భుతమును, నిర్మలమైన నీ మహిమ యనెడి సముద్రమును ధ్యానము చేయుచున్నారు. శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

రంభావనం ప్రతిదినం రమణీయదృశ్యం
పశ్యంతి కిన్నర గణాస్తవ శైలభాగే
హేహాటకేశ్వర విభో పరిరక్షభక్తాన్‌
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : నీ పర్వత భాగమునందు కిన్నర సముదాయములు ప్రతి దినమును రమణీయములైన దృశ్యములు గల అరటి చెట్ట వనమును చూచుచున్నవి. ఓ హాటకేశ్వరా! ప్రభూ! భక్తులను రక్షింపుము. శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

పాతాళగంగాజల మజ్జనపూతభక్త
వీతాఘమౌని నుతదివ్యపదారవింద
సీతాసుపూజిత పరాత్పర లింగమూర్తే
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : పాతాళ గంగా జల స్నానముచే పవిత్రులైన భక్తుల చేతను, పాపరహితులైన మునీశ్వరుల చేతను స్తుతింపబడిన దివ్య పాద పద్మములు కలవాడా! సీతచే పూజింపబడినవాడా! పరాత్పరా! లింగమూర్తీ! శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

గంధర్వగాన పరితుష్టదయావిశిష్ట
గంధద్విపాసుర వినాశక నీలకంఠ
మందాకినీ సుమసమర్చిత మంజులాంగ
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : గంధర్వ గానముచే సంతోషించినవాడా! దయా విశేషము కలవాడా! మదించిన గజాసురుని నాశనము చేసిన వాడా! నల్లని కంఠము కలవాడా! గంగానది యందలి పువ్వులచే పూజింపబడిన మృదువైన దేహము కలవాడా! శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

కైలాసపర్వత విచాలక బహుశాలి
దేవారిరావణ నుతోత్తమపాదపద్మ
సారంగనామ మఠమంగళ భవ్యసద్మ
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : కైలాస పర్వతమును చలింపజేయు బాహు విక్రమ శాలియైన రావణునిచే స్తుతింపబడిన పాదపద్మములు కలవాడా! సారంగమను పేరుగల మఠమే మంగళకరమైన నివాసముగా కలవాడా! శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

దక్షప్రజాపతి కృతోజ్జ్వలయజ్ఞభంగ
రక్షాప్తదేవ బహుశంసిత విక్రమాఢ్య
మోక్షం ప్రయచ్ఛ నిజభక్తజనాయ శంభో
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : దక్ష ప్రజాపతిచే చేయబడిన గొప్ప యజ్ఞమును భంగము చేసిన వాడా రక్షింపబడిన దేవతలచే కీర్తింపబడిన పరాక్రమ సంపద కలవాడా! శంభో! నీ భక్త జనమునకు మోక్షము నిమ్ము. శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

క్షీరాభిషేక మఖిలాస్సుర మౌనిబృందా:
కుర్వంతితే సురపతే నిరతంత్రికాలమ్‌
వక్తుంబుధాస్తవ గుణాన్న హిశక్నువంతి
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : దేవతానాథా! సర్వదేవతాముని సమూహములు ఎల్లప్పుడు త్రికాలములందును నీకు పాలతో అభిషేకము చేయుచున్నారు. దేవతలు నీ గుణములను వర్ణించుటకు శక్తులు కాకున్నారు. శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

గోత్రారిపుత్ర విజయోత్తమ శస్త్రదాయి
మిత్రేందువహ్ని నయనోజ్జ్వల దివ్యరూప
సుత్రామముఖ్య సురశేఖర నిత్యగీత
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : దేవేంద్రుని కుమారుడైన అర్జునునకు ఉత్తమమైన పాశుపతాస్త్రమును ప్రసాదించిన వాడా! సూర్యుడు, చంద్రుడు, అగ్ని అను నేత్రములు గలిగిన దివ్యరూపుడా! దేవేంద్రుడు మొదలైన దేవతా ప్రభువులచే నిత్యము స్తోత్రము చేయబడు వాడా! శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

గంగావతంస మునిరాజ హృదబ్జహం స
శృంగార బిల్వ వనరాజి సదానివాస
లింగాకృతి స్పురితశైల మహావిలాస
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : గంగ శిరోభూషణముగా కలవాడా! మునీంద్రుల హృదయము లనెడి పద్మములకు సూర్యుని వంటివాడా! సుందరమైన బిల్వవనసమూహము నందు నివసించువాడా! లింగాకారముతో ప్రకాశించు పర్వతము పై గొప్ప విలాసముతో వసించు వాడా! శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

బ్రహ్మాదయోనిఖిల దేవ గణాస్త్వదీయే
ద్వారేవసంతి సతతం తవదర్శనాయ
సర్వేష్ట పూరక సురేశ్వర సాంబమూర్తే
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : ఎల్లరి కోరికలను తీర్చు వాడా! దేవతా నాథా! సాంబమూర్తీ! బ్రహ్మాది సర్వదేవతా సమూహములు నీ దర్శనము కొరకై ద్వారమందు వసించి యున్నది. శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

భక్తాళిసేవ్య సురసాక్షి గణాధిపస్త్వం
శ్రీసిద్ధరామ మునిభక్తి ముదంతరంగ
గోగర్భ మస్తిలసితం తవశైలభాగే
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : భక్త సముదాయముచే సేవింపబడు పాదములు కలవాడా! సాక్షి గణపతివి నీవే. శ్రీ సిద్ధరాముడను ముని యొక్క భక్తిచే సంతోషము పొంది హృదయము కలవాడా! నీ శైల భాగము నందు గోగర్భము ప్రకాశించుచున్నది. శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

శ్రీశైలమార్గ శిఖరేశ్వర పాహినిత్యం
త్వత్పాదపద్మ భజనోత్సుక భక్తబృందమ్‌
కోటి ప్రభాకర మహోజ్జ్వల దివ్యతేజ:
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : శ్రీశైల మార్గము నందలి శిఖరమునకు స్వామీ! నీ పాద పద్మములను భజించు భక్త సముదాయమును నిత్యము రక్షింపుము. కోటి సూర్యుల వలె గొప్పగా ప్రకాశించు దివ్యమైన తేజస్సు కలవాడా! శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

త్వత్పూజయా సుఖకరం బహుభాగ్యరాశిం
సంప్రాప్నువంతి మనుజా భువి సర్వకాలమ్‌
క్షీరౌఘధార బహుపావన శైలరాజ
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : పాలధారచే మిక్కిలి పవిత్రమైన పర్వతరాజము కలవాడా! భూలోకమందు మానవులు సర్వకాలమందును నీ పూజచే సుఖమును కలిగించు గొప్ప భాగ్యరాశిని పొందుచున్నారు. శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

చింతామణి భృతి దేవ మణిప్రభాభి:
దేదీప్యమాన హిమశైల సుతాధినాథ
శ్రీశైలధామ కమనీయ గుణాభిరామ
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : చింతామణి మొదలైన దేవతామణుల కాంతులచే ప్రకాశించు హిమవంతునకు కూతురైన పార్వతికి నాథుడా! శ్రీశైలవాసా! అందమైన గుణములచే మనోహరుడా! శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

శంభోత్వమేవ జననీ జనకోజనానాం
కుంభోద్భవాది మునిమండల కీర్తనీయ
అంబోజ సంభవ సురప్రముఖాళిసేవ్య
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : హే శంభో! జనులకు నీవే తల్లివియు తండ్రియు. అగస్త్యుడు మొదలైన ముని సముదాయములచే కీర్తింపదగిన వాడా! బ్రహ్మ చేతనను దేవతా ప్రభువుల సముదాయము చేతను సేవింపబడిన వాడా! శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

ఖంజోపి ధావతి గిరౌ తవసుప్రభావాత్‌
అంధోసి పశ్యతి మనోహర వస్తుజాలమ్‌
మూకోపివక్తి మధురం ఘన వేదపాఠం
శ్రీమల్లికార్జునవిభో తవ సుప్రభాతమ్‌

తాత్పర్యము : నీ ప్రభావముచే కుంటివాడు కూడ పర్వత భాగము నందు పరుగెత్తుచున్నాడు. గుడ్డివాడు కూడ సుందరమైన వస్తు సముదాయమును చూడ జాలుచున్నాడు. మూగవాడు కూడ మధురముగా వేద పాఠమును చేయుచున్నాడు. శ్రీమల్లికార్జున స్వామీ! నీకు సుప్రభాతము.

-:శ్రీ మల్లికార్జున సుప్రభాతం సంపూర్ణం:-

Advertisement

తాజా వార్తలు

Advertisement