శ్రీమన్నారాయణుడు జగత్తును సృష్టించాలి అనుకున్నప్పుడు రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మ అన్న నామంతో సృష్టి చేస్తాడు. రక్షించాలి అనుకున్నప్పుడు సత్వగుణాన్ని తీసుకొని విష్ణువు అన్న నామంతో రక్షిస్తాడు. సంహరించాలి అనుకున్నప్పుడు తమోగుణాన్ని తీసుకొని రుద్ర నామం తో సంహరిస్తాడు. సూక్ష్మ దృష్టితో చూస్తే ఈ మూడు రక్షణకే. అవసరమైనపుడు సృష్టించడం, అవసరం లేని దాన్ని తప్పించడం, ఈ రెండూ రక్షణలో భాగమే. క్షీరసాగరమున ఆదిశేషునిపై పడుకుని ఉన్న స్వామి ” సహస్ర శీర్ష పురుష: సహస్రాక్ష: సహస్రపాత్” అని చెప్పినట్టుగా పరమాత్మ విశ్వరూపమే అన్ని అవతారాలకు ఆధారం. స్వామి అవతారాలు అనంతాలైనా దశావతారులు ప్రసిద్ధం కాగా ప్రధానంగా పురాణాల్లో పేర్కొనబడినవి 24 అవతారాలు. ఈ అవతారాల వైశిష్ట్యం, వైభవం, విశేషాలు, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోదగినవి.
ఈరోజు పృథు చక్రవర్తి విశేషాలపై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ
పృథు చక్రవర్తి
మృత్యుదేవుని పుత్రిక అయిన సునీధ అంగరాజుల సంతానము వేనుడు. అధర్మ ప్రవర్తకుడు కుమారుడిగా పొందగలదని శాపాన్ని పొందిన సునీధ
స్నేహితురాలైన రంభ సలహా మేరకు ఋషుల వలన ధర్మప్రవృత్తుడైన పుత్రుడు కలుగుతాడని వరము పొందిన అంగరాజును వివాహమాడింది. అయిననూ వేనుడు అధర్మప్రవక్తుడైనాడు. వేనుడి అధర్మప్రవర్తనతో కోపించిన ఋషులు కుశ ప్రహారముతో దక్షిణబాహువుని వధించగా పుట్టినవాడు పృథు చక్రవర్తి. పృథువు పుట్టుకతో వేనుని పాపాలన్నీ హరించిపోయి మోక్షాన్ని పొందాడు. వేనుని పాప ఫలితము వలన పంటలు పండకపోవడంతో పృథు చక్రవర్తి ఆగ్రహంతో ధనస్సును ధరించి భూమిని హరింప చూడగా రాజు ఆగ్ర హిస్తే రాజ్యం, ప్రజలు నశిస్తారని ఉపాయంతో కార్యం సాధించాలని భూమాత ఉపదేశించెను. తాను గోరూపాన్ని ధరిస్తానని తగిన దూడను ఏర్పరచి కావాల్సిన పంటలను పాలరూపంలో తీసుకోమని భూమాత ఆదేశించింది. పృథువే దూడగా మారి ప్రజలకు కావాల్సిన పంటలను పాలరూపంలో తీసుకున్నారు. ఈవిధంగా ఎవరికి ఏమేమీ కావాలో వారు దూడగా మారి కావాల్సిన వాటిని పాలుగా తీసుకున్నారు. మేరు పర్వతం దూడగా మారి రత్నాలను, వాసుకి దూడగా మారి విషాన్ని, వృక్షాలు దూడగా మారి ఫలాలను ఇలా నశించిన సకల సంపదలను గోరూపంలో ఉన్న భూదేవి నుండి పృథు చక్రవర్తి ప్రజలకు అందించాడు. ఈనాడు మనం అనుభవిస్తున్న సంపద అంతా పృథు చక్రవర్తి అందించినదే. వర్షాలు పడనపుడు సాగు, తాగు నీరు అందించడానికి ఎన్నో ఆనకట్టలను కట్టించిన సాగు, తాగునీటి నిపుణుడు పృథుచక్రవర్తి. పర్వత ప్రాంతాలలో ఎత్తుపల్లాలను సమానంగా చేసి నగరాలను, పట్టణాలను, తాలుకాలను, గ్రామాలను, తండాలను ఇత్యాది జననివాస వ్యవస్థను ఏర్పరచిన సివిల్ ఇంజనీర్ పృథుచక్రవర్తి. నదీప్రవాహాన్ని పట్టణ, గ్రామ పరిసరాలకు ప్రవహించేలా కాలువలు, సెలయేర్లు మొదలగు జలప్రవాహ వ్యవస్థను, జలప్రవాహ ఘర్షణ నుండి వి ద్యుత్‌ను ఏర్పరచి జలవిద్యుత్ వెలుగులు అందించాడు. ఈనాటి నాగరిక జనజీవన విధానమంతా పృథుచక్రవర్తి మేథాసంపత్తితో దూరదృష్టితో, ధర్మప్రవృత్తితో సకల ప్రాణుల సంక్షేమ కాంక్షతో ఏర్పడినదే. అందువలన మన పురాణాలు పృథుచక్రవర్తిని ఆదిరాజు అని కీర్తించాయి.
…శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి