శ్రీమన్నారాయణుడు జగత్తును సృష్టించాలి అనుకున్నప్పుడు రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మ అన్న నామంతో సృష్టి చేస్తాడు. రక్షించాలి అనుకున్నప్పుడు సత్వగుణాన్ని తీసుకొని విష్ణువు అన్న నామంతో రక్షిస్తాడు. సంహరించాలి అనుకున్నప్పుడు తమోగుణాన్ని తీసుకొని రుద్ర నామం తో సంహరిస్తాడు. సూక్ష్మ దృష్టితో చూస్తే ఈ మూడు రక్షణకే. అవసరమైనపుడు సృష్టించడం, అవసరం లేని దాన్ని తప్పించడం, ఈ రెండూ రక్షణలో భాగమే. క్షీరసాగరమున ఆదిశేషునిపై పడుకుని ఉన్న స్వామి ” సహస్ర శీర్ష పురుష: సహస్రాక్ష: సహస్రపాత్” అని చెప్పినట్టుగా పరమాత్మ విశ్వరూపమే అన్ని అవతారాలకు ఆధారం. స్వామి అవతారాలు అనంతాలైనా దశావతారులు ప్రసిద్ధం కాగా ప్రధానంగా పురాణాల్లో పేర్కొనబడినవి 24 అవతారాలు. ఈ అవతారాల వైశిష్ట్యం, వైభవం, విశేషాలు, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోదగినవి.
ఈరోజు నరనారాయణుల అవతార వైశిష్ట్యాన్ని గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ
దక్షప్రజాపతి పుత్రికా మూర్తికి, ధర్ముడు అను ప్రజాపతికి అవతరించిన వారు నర నారాయణులు. వీరు పుట్టగానే బదరికాశ్రమానికి వెళ్ళి తపస్సును ఆచరించి, లోక కళ్యాణాన్ని సమకూర్చి అన్ని ఫలాలను అందించేది, అన్ని పాపాలను పోగొట్టేది తపస్సే అని లోకానికి బోధించారు. అరణ్యంలో నిద్రాహారాలు మాని శరీరాన్ని, మనస్సును శుష్కింప చేసుకునేది మాత్రమే తపస్సు కాదని, నిత్య జీవితంలో మనం బాగా ఇష్టపడి అనుభవిస్తున్న వాటిని ఏ కొద్దిగా తగ్గించుకున్నా తపస్సే అని లోకానికి బోధించినవారు నర నారాయణులు. తమ తపస్సును భంగపరచడానికి ఇంద్రుడు పంపిన రంభ, మేనక, తిలోత్తమ వంటి అప్సరసల అందం ఏమాత్రమని తమ ఉరువు నుంచి అతిలోక సౌందర్యరాశి అయిన ఊర్వశిని సృష్టించి ఇంద్రునికి కానుకగా పంపారు. అపకారం చేసిన వారికి ఉపకారం చేసి, కోరికను గెలిచినవాడు కాదు కోపాన్ని జయించిన వాడే దేవుడని లోకానికి ధర్మసూక్ష్మాన్ని బోధించినవారు నర నారాయణులు. సహస్ర కవచుడు అను రాక్షసుడు తపస్సు చేసి ఒక్కడే ఒకేసారి ఐదువందల సంవత్సారాలు తపస్సు, యుద్ధం చేసినవాని చేతిలోనే మరణం పొందాలని శంకరుని నుండి వరం కోరుకున్నాడు. ఆ వరాన్ని సార్ధకం చేయడానికి స్వామి నరనారాయణుల రూపంలో రెండు రూపాలు ధరించి నరుడు తపస్సు చేస్తే, నారాయణుడు యుద్ధం చేయగా, నారాయణుడు తపస్సు చేస్తే నరుడు యుద్ధం చేసాడు. ఈ విధంగా నారాయణుడు వెయ్యి కవచాలను తన చక్రంతో చేధిస్తూ ఉండగా శంకరుడు తానిచ్చిన వరాన్ని మన్నించమని కోరగా అతడిని మూడు కవచాలతో వదిలాడు. తర్వాత కాలంలో త్వష్ట ప్రజాపతికి పుత్రుడై వృత్రాసురుడుగా పుట్టి ఇంద్రునిచే వధించబడగా మరొక కవచం పోయింది. తరువాత ఘంటాకర్ణుడను రాక్షసుడిగా పుట్టి స్వామిచే వధించబడి రెండవ కవచాన్ని పోగొట్టుకున్నాడు. చివరగా సహజ కవచకుండలాలతో కర్ణుడిగా పుట్టి అర్జునుడు అనగా నరునితో వధించబడి ముక్తిని పొందాడు సహస్రకవచుడు.
…శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి