Saturday, November 23, 2024

శ్రీమన్నారాయణుని అవతారాలలోని ఆంతర్యం (ఆడియోతో..)

శ్రీమన్నారాయణుడు జగత్తును సృష్టించాలి అనుకున్నప్పుడు రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మ అన్న నామంతో సృష్టి చేస్తాడు. రక్షించాలి అనుకున్నప్పుడు సత్వగుణాన్ని తీసుకొని విష్ణువు అన్న నామంతో రక్షిస్తాడు. సంహరించాలి అనుకున్నప్పుడు తమోగుణాన్ని తీసుకొని రుద్ర నామం తో సంహరిస్తాడు. సూక్ష్మ దృష్టితో చూస్తే ఈ మూడు రక్షణకే. అవసరమైనపుడు సృష్టించడం, అవసరం లేని దాన్ని తప్పించడం, ఈ రెండూ రక్షణలో భాగమే. క్షీరసాగరమున ఆదిశేషునిపై పడుకుని ఉన్న స్వామి ” సహస్ర శీర్ష పురుష: సహస్రాక్ష: సహస్రపాత్‌” అని చెప్పినట్టుగా పరమాత్మ విశ్వరూపమే అన్ని అవతారాలకు ఆధారం. స్వామి అవతారాలు అనంతాలైనా దశావతారులు ప్రసిద్ధం కాగా ప్రధానంగా పురాణాల్లో పేర్కొనబడినవి 24 అవతారాలు. ఈ అవతారాల వైశిష్ట్యం, వైభవం, విశేషాలు, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోదగినవి.

ఈరోజు ధన్వంతరి అవతార విశేషాలపై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ
ధన్వంతరి
దేవతల ప్రార్థన మేరకు శ్రీహరి వారికి అమృతము అందించాలని సంకల్పముతో క్షీరసాగర మదనం జరింపించగా క్షీరసాగరమున అమృతభాండము తీసుకుని ధన్వంతరి ఆవిర్భవించింది. ధన్వంతరిని అమృత పురుషుడు అని అంటారు. ‘ధనూ’ అనగా చికిత్సకు అందని వ్యాధి, ‘అంత’ అనగా నాశము ‘రి’ అనగా కలిగించువాడు. చికిత్సకు లొంగని వ్యాధులను న శింపచేయువాడు అని ధన్వంతరి శబ్ధానికి అర్థము. సకల లోకాలలో చికిత్సకు అందని వ్యాధి మరణమే కావున దానిని తొలగించి అమృతాన్ని ఇచ్చి అంతర్థానం అయినట్లు భాగవతాది పురాణాలలో చెప్పబడింది. అలా వచ్చిన స్వామి వృక్షశాస్త్రమును, ఔషధ శాస్త్రమును చికిత్సా విధానాన్ని వివరించే 18 మహా గంథ్రాలను అందించారు. వాటిని ఆధారంగా చేసుకుని చవన, అత్రి, బృహస్పతి, కవి, చంద్ర, వరుణ, మను, ఇక్ష్వాకు మొదలగువారు వైద్య శాస్త్ర గ్రంథాలను అందించారు. ఇలా ధన్వంతరి వైద్య శాస్త్రాన్ని ఆరోగ్య సూత్రాలను అందించారు.
ఆశాచ పరమా వ్యాధి తతో ద్వేష: తతో మను: |
తేషాం వినాశినే వైద్యం నారాయణ పరాస్మృతి: ||
ధన్వంతరం అను గ్రంథానుసారం అన్ని వ్యాధుల కంటే పెద్ద వ్యాధి ‘ఆశ’ తర్వాత ‘ద్వేషం’ ఆ తర్వాత ‘కోపం’ ఈ మూడు వ్యాధులకు చికిత్స నారాయణ మంత్రం. ఇటువంటి ఆధ్యాత్మిక వ్యాధి నివారణ, ఆది భౌతిక వ్యాధి నివారణ, ఆది దైవిక వ్యాధి నివారుణలకు వైద్య శాస్త్రాన్ని ప్రవర్తింపచేసిన వాడు ధన్వంతరి.

…శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement