Friday, November 22, 2024

శ్రీకృష్ణ లీలా విలాసం

అష్టమి నాడు అవతరించె అష్టమ గర్భుడు అదిగో నల్లదిగో
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయవచ్చె నదిగో నల్లదిగో
చేష్టలుడిగి ఉపవిష్టుల్కెరి అందరు నదిగో నల్లదిగో
సాష్టాంగ పడిన వెతలెల్ల తీర్చు కృష్ణస్వామి నదిగో నల్లదిగో !!

గోవింద నామముతో ఖ్యాతికెక్కిన కృష్ణుడే పరమేశ్వరుడు. సచ్చిదానంద విగ్రహుడు. జగత్తుకే మూలాధారమైనవాడు. ఆది, అంతము లేనివాడు.
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరే హరే
హరేరామ హరేరామ రామరామ హరే హరే
ఇది దివ్యనాద ప్రకంపనము. ఇది కల్మషాన్ని తుడిచివేస్తుంది. ఈ హరేకృష్ణ సంకీర్తనతో మన బుద్ధి శుద్ధం కాగా, భౌతిక అశాంతు లు మాయమైపోతాయి. భక్తుల పట్ల కృష్ణుడు రక్షకుడుగా వుం టాడు. శ్రీకృష్ణ అవతారమే సర్వ కళాసమన్వితము, సకల జన ఆలంబనము, సకల శాస్త్ర పారంగతము, సకల విద్యా కౌశలము, సకల ప్రేమ సుధాభరితము. నిత్యము చింతలతో, భరింపలేని ఒం టరితనంతో నిస్తేజమై ఉండే మధుర కారాగారం దేవకీ వసుదేవుల అష్టమ గర్భాన దేవదేవుడు జనియించటంతో నిలువెల్లా, తనువెల్లా పులకించి పోయింది. కష్ట నష్టాలకు కాలం చెల్లిందని శుభ సంకేతా లు లోకమంతటా ప్రసరించిన దివ్య తిథి శ్రావణ కృష్ణ రోహణీ నక్షత్రయుక్త అష్టమి. పరివేష్టిత జనులు, పశుపక్ష్యాదులు, ప్రకృతి మాయలో మునిగి ఏదో తెలి యని లోకాలలో విహరించేలా చేసినది శ్రీకృష్ణ జన్మాష్టమి.
శరణు ఘోష శరణాగతుల పాపహరణ కర్పూరమా
వేదన వేడికోలు విధివంచితులు తాపహరణ నీహారమా
కొల్వనేరని మందమతుల శోకహరణ దయాసారమా
నిఖిల లోకాల జీవకోటుల భయహరణ శ్రీకృష్ణ చరణమా !!
పరుల సొమ్ములను అపహరించే దొంగగా ముద్ర వేయించు కున్న ముకుందుడు, తామరాకుపై నీటిబిందువు వోలె భవ బంధా లకు, రాగద్వేషాలకు అతీతమై లోక కళ్యాణానికై తమ సంపదలను వినియోగించాలన్న సందేశాన్ని మనకు అందించాడు. ధనధాన్యా లు, మణిమాణిక్యాలు, రత్నపు రాశులు కొరగానివని, చిన్న తులసి దళంతోనే శ్రీకృష్ణుని సొంతం చేసుకోవచ్చునని మనకు భాగవతం తెలియచేస్తోంది. నిష్కామ కర్మాచరణం, నిష్కల్మష ఆత్మనివేదనం శ్రీకృష్ణ సంతృప్తి కారకాలు. అణురేణు పరమాణు వ్యాపకమైన లీలామానుష వేషధారి శ్రీకృష్ణ లీలావైభవం అనన్య సామాన్యం. కుచేలుని వృత్తాంతము, కుబ్జ చందన పూతల పులకరింత, పేద పూలవాని మాలాధారణము, విదురుని ఆతిధ్య స్వీకరణ మొదలైన ఘట్టాలు మన అంతరంగంలో కలకాలం వుంటాయి.
ఎదుటివారు శత్రువువైనా, మిత్రులైనా సమ భావనమే. ఇంకా చెప్పాలంటే తనను ద్వేషించిన వారిపైనే అనురాగం ఎక్కువ. అం ధుడైన దృతరాష్ట్రునికి అపురూపమైన విశ్వరూప సందర్శన భాగ్యా న్ని ఇచ్చాడు. యుగయుగాలుగా, నియమ నిష్టలతో తపస్సు చేసిన వారికి కూడా అది లభ్యం కాలేదు. కాళీయుని శిరస్సుపై తన పాద ముద్రలు అలంకరించి, శాశ్వతంగా సర్ప భయంకరుడైన గరు త్మంతుని భయం లేకుండా చేశాడు. నూరు దూషణలు చేసిన శిశు పాలుని తనలో ఐక్యం చేసుకున్నాడు.
శ్రీకృష్ణుడు ప్రకృతి ప్రేమికుడు. పరమాత్మ ప్రకృతిలోనే అంత ర్లీనంగా ఉంటాడన్న సందేశము మనకు ఆయన జీవిత వైభవం తెలియచేస్తుంది. ఆయన అలంకార ప్రియుడు. రకరకాల పూవుల తో, సుగంధ చందనాలతో అలరారుతూ ఉంటాడు. ఇవన్నీ మనకు ప్రకృతి నుండే లభిస్తాయి. అంటే శ్రీకృష్ణుని అర్చన మిషతో మనం ప్రకృతిని ప్రేమించవలసినదే. మనం జీవించాలంటే పశు పక్ష్యాదు లు ఉండి తీరవలసినదే. అవి జీవించాలంటే ప్రకృతి నుండి లభించే ఆకులు, అలములు, గడ్డి, స్వచ్ఛమైన జలము, కాలుష్య ర#హత వాతావరణం అవసరం. ఇదే సందేశాన్ని మనకు గోవర్థనోద్ధరణ ము, ఉట్ల సంబరాలు, యుద్ధ సమయంలో అర్జునునికి అస్త్ర ప్రయో గ జాగ్ర త్తలు తెలిపే వైనం మొదలైనవి తెలియచేస్తాయి.
సాగరంలో కలిసే ఉప్పు కణానికి ఎలా ఉనికి ఉండదో, అలాగే మనమూ శ్రీకృష్ణ ప్రేమ సాగరంలో కలసిపోవాలి. శ్రీకృష్ణుడు అం దించిన సమతత్వం, పరోపకార తత్త్వం, సహజీవనం మొదలైనవి మనం అలవరచుకుంటే మన జీవనం నందనవనం అవుతుంది. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ పరమాత్మ కరుణ కు పాత్రులవుదాం.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు !!

– డా. దేవులపల్లి పద్మజ
98496 92414

Advertisement

తాజా వార్తలు

Advertisement