Tuesday, November 26, 2024

శ్రీకాళ హస్తీశ్వరాశతకం

67. ఒకరిం జంపి పదస్థులై బ్రదుక తా మొక్కొక్క రూహింతురే లకొ తామెన్నడు( జావరో తమకు బోవో సంపదల్
పుత్ర మిత్ర కళత్రాదుల తోడ నిత్యసుఖమందం గందురో యున్నవారికి లేదో మృతి యెన్నడుం గటకటా! శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా! ఒక్కొక్కరు – కొందరు, ఒకరిన్ – ఒకరిని, చంపి – సంహరించి, తాము – పదస్థులు – ఐ – పదవిని అధిష్ఠించి, బ్రతుకన్ – జీవించాలని, ఊహింతురు – ఆలోచిస్తారు, ఏల – ఒకో – ఎందుకో ఏమో, కటకటా – అయ్యయ్యో!, తాము – తాము, ఎన్నడున్ – ఎప్పటికి, చావరు – ఓ – చనిపోకుండా బ్రతికి ఉంటారా?, తమకు – తమకు, సంపదలు – ఐశ్వర్యాలు, పోవు్శఓ – నశింపకుండా ఉంటాయా?, పుత్ర – సంతానంతోనూ, మిత్ర – స్నేహితులతోనూ, కళత్ర – ఆదుల తోడ – భార్య మొదలైన వారితో, నిత్యసుఖము – శాశ్వత ఆనందాన్ని, అందన్ – కందురు – ఓ – పొందగలుగుతారా?, ఉన్నవారికి – కలవారికి, (ధనవంతులకి, బ్రతికి ఉన్నవారికి), మృతి – మరణం, లేదు – ఆ – ఉండదా?

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా!కొందఱు ఇతరులను చంపి, పదవిలోకి వచ్చి బ్రతకాలనుకుంటారు. తాము ఎప్పటికీ చావకుండా ఉంటారా? తమ సంపదలు పోకుండా ఉంటాయా? భార్యాబిడ్డలతో, మిత్రులు మొదలైనవారితో శాశ్వతంగా(శాశ్వతమైన) సుఖాన్ని పొందగలరా? ధనవంతులకి మరణం రాదా? అయ్యో! (మానవులీ విషయాలు ఆలోచించ లేరెందుకు?)

విశేషం: జీవితం అశాశ్వత మైన దని తెలిసి కూడ, అందులోనూ అశాశ్వతాలైన పదవికోసం, సంపదలకోసం ఇతరులను చంపేవారి అజ్ఞానానికి బాధపడుతున్నాడు ధూర్జటి.
నిజానికి ఈ స్థితి ధూర్జటి కాలానికే కాదు, ఈ కాలానికి మఱింతగా వర్తిస్తుంది. ఆ కాలంలో పదవికోసం పోరాడింది రాజులు కొద్దిమంది మాత్రమే. ఇప్పుడో?ప్రజాప్రభుత్వం కనుక, ప్రయత్నించనివారి సంఖ్య తక్కువ. ఆలోచించాల్సిన విషయం కాదా మఱి!

డాక్టర్ అనంతలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement