Thursday, November 21, 2024

శ్రీకాళహస్తీశ్వర శతకం

103
జలజశ్రీ గల మంచినీళ్ళు గలవే చట్రాతిలో? బాపురే
వెలివాడన్ మఱి బాప నిల్లు గలదా? వేసాలు గా కక్కటా
నలినా రెండు గుణంబు లెంచి మదిలో నన్నేమి రోయంగ (నే) నీ
చెలువం బైన గుణంబు లెంచు కొనవే శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, బాపురే – ఆశ్చర్యం, చట్రాతిలో – చట్టుబండలో/నల్లరాతిలో, జలజశ్రీ – కల – కమలాల సంపదతో కూడి యున్న, మంచినీళ్ళు – త్రాగటానికి అనువైన నీళ్ళు, కలవు – ఏ – ఉన్నాయా?, మఱిన్ – ఇంకా, వెలివాడన్ – వెలివేయబడినవారి వీధిలో/ అంటరానివారుండే ప్రదేశంలో, బాపన – ఇల్లు – బ్రాహ్మణగృహం, కలదా – ఉన్నదా? అక్కటా – అయ్యో! వేసాలు – కాక్స (ఉన్నాయన్నమాట అంటే)వేషాలు కదా! (నిజము కాదు), నలిన్ – బాగుగా, ఆ రెండు గుణంబులు – ఎంచి – ఆ రెండు లక్షణాలని ఆలోచించి/పరిగణించి, మదిలో – మనస్సులో, నన్నున్ – నన్ను, రోయంగన్ – అసహ్యించుకోవటం, ఏమి? – ఎందుకు?, నీ చెలువంబు – అయిన – నీకు అందమైన / నచ్చిన, గుణంబులు – లక్షణాలు, ఎంచుకొనవు – ఏ – ఎన్నిక చేసి గ్రహించు / ఏరి తీసుకో.

తాత్పర్యం :
శ్రీకాళహస్తీశ్వరా! బండరాతిలో పద్మాల సొబగుతో ఉన్న తాగటానికి పనికి వచ్చే నీళ్ళు ఉంటాయా? అంటరానివారు ఉండే, వెలివేయబడినవారు ఉండే వీధుల్లో బ్రాహ్మణగృహం ఉంటుందా? ఉన్నాయి అంటే ఎంత ఆశ్చర్యం! అన్నీ వేషాలే.(ఉండవు. ఉన్నాయి అంటే వేషాలు వేయటం తప్ప వాస్తవం కాదు) చక్కగా ఈ రెండు లక్షణాలని (నిజము, వేషం) పరిగణనలోకి తీసుకొని నన్ను అసహ్యించుకోవలసిన పని ఏమి? (నేను కూడా అటువంటి వాడిని అనుకోవలసిన పని లేదు.) నాలో ఉన్న ఏదో ఒక మంచిగుణాన్ని నీవే ఏరి, నన్ను స్వీకరించ వలసింది.

విశేషం:
రాతి మధ్య కొద్దిగా నీళ్ళు, అందులో కప్ప ఉండవచ్చు. కాని పద్మసరస్సు ఉండదు. వెలి అనే ఆచారం సంఘంలో ఉన్న రోజుల్లో వెలివాడలో బ్రాహ్మణగృహం ఉండదు. సద్గుణాలు కాఠిన్యం (చట్రాయి వలె) కాలుష్యం (వెలివాడ) ఉన్నచోట ఉండవు. ఆ రెండింటినే చూసి అందరూ అదేవిధం అనుకోకూడదు. ఎటువంటివారి లోనూ ఏదోఒక మంచిగుణం
ఉండకపోదు. తాను మంచి అనుకున్నది మంచి అవవచ్చు, కాకపోవచ్చు. ఆ నిర్ణయం ఎంపిక భగవంతుడికే వదలటం ఉత్తమం. ఐ కెనాట్ చూజ్ ది బెస్ట్ అంటాడు విశ్వకవి రవీంద్రనాథ టాగోర్.

డాక్టర్ అనంతలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement