Monday, November 25, 2024

శ్రీకాళహస్తీశ్వర శతకం

102. భసితోద్ధూళన ధూసరాంగులు, జటాభారోత్తమాంగుల్, తపో
వ్యసనుల్, సాధిత పంచవర్గరతులున్, వైరాగ్యవంతుల్, నితాం
త సుఖస్వాంతులు, సత్యభాషణ సముద్యద్రత్నరుద్రాక్ష రా
జి సమేతుల్తుద నెవ్వరైన గొలుతున్ శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, భసిత – భస్మము/విభూతి, ఉద్ధూళన – పైపూతగా పూసుకొనటం వలన, ధూసర – అంగులు – బూడిదరంగు శరీరంకలవారు, జటాభార – జడలబరువుతో కూడిన, ఉత్తమ – అంగుల్ – శిరస్సులుకలవారు, తపోవ్యసనుల్ – తపస్సే వ్యసనంగా కలవారు (తపస్సు చేయకుండా ఉండలేనివారు), సాధిత – సాధించబడిన, పంచవర్గరతుల్ – పంచాక్షరీమంత్రము నందాసక్తికలవారు, వైరాగ్యవంతుల్ – లౌకికవ్యవహారాల పట్ల విరక్తిచెందినవారు, నితాంత – అంతులేని/పరిపూర్ణమైన, సుఖస్వాంతులు – ఆనందంతో నిండిన మనస్సు కలవారు, సత్యభాషణ – నిజం పలుకుట అనే, సం – ఉద్యత్ – రత్న – చక్కగా ప్రకాశిస్తున్న మణులతోనూ, రుద్రాక్షరాజి – రుద్రాక్షల వరుసలతోనూ, సమేతుల్ – కూడినవారు, తుదన్ – చివరకు, ఎవ్వరైనన్ – ఎవరైనా సరే, కొలుతున్ – సేవిస్తాను.

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! విభూతిపూతచే బూడిద రంగు కల శరీరం కలవారు, జడలబరువుతో ఉన్న శిరస్సు కలవారు, తపస్సు చేయక ఉండలేనివారు, పంచాక్షరీమంత్రాన్ని సాధించి, జపించటంలో ఆనందపరవశులయి ఉండేవారు, లౌకికభోగాలమీద విరక్తిచెందినవారు, అంతులేని స్థిరమైన ఆనందం మనస్సులో నింపుకున్నవారు, సత్యభాషణం అనే ప్రకాశించే మణులతోనూ, రుద్రాక్షలతోనూ కూడినవారు అయితే చాలు. వారెవ్వరైనా సరే వారిని సేవిస్తాను.

విశేషం: “దాసదాసోహం” అనే భావన ఈ పద్యంలో వ్యక్త మౌతుంది. శివుడి వలె వేషధారణ చేయటం గొప్పస్తుతి. అందులోనూ పరిమళద్రవ్యాలు కాక విభూతిపూత పూయాలంటే ఎంతటి భక్తి ఉండాలి? శివభక్తులనగలలో ఉండే మెరిసే మణులు సత్యభాషణ మట. అన్ని ఆభరణాల లోకి విలువైనది వాక్కు. “వాగ్భూషణం భూషణం.” అది సత్యవాక్కై నప్పుడే ప్రకాశిస్తుంది. అది భక్తులు, సత్పురుషుల లక్షణం. “సత్యాయ మితభాషిణాం.” అంటాడు కాళిదాసు రఘువంశంలో. విభూతి, జడలు, పంచాక్షరి, రుద్రాక్షలతో పాటు సత్యభాషణం కూడ శివుడికి ప్రీతిపాత్రమైనదే. ఈ లక్షణాలు అన్నీ కాని, కొన్ని కాని ఉంటే శివార్చన చేసే చేసే తాను వారిని సేవించుకుంటా నని మాట ఇచ్చాడు ధూర్జటి.

డాక్టర్ అనంతలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement