99.
తాతల్దల్లియుదండ్రియున్మఱియుపెద్దల్చావగాజూడరో
భీతింబొందగ నేల చావునకుగాపెండ్లాము బిడ్డ ల్హిత
వ్రాతంబుల్తిలకింప జంతువులకు న్వాలాయమైయుండగా
చేతో వీధి నరుండునిన్గొలువడోశ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!తాతల్ – మాతామహపితమహాదులు, తల్లియు – తనను కన్నతల్లి, తండ్రియున్ – జనకుడు, మఱియు – ఇంకా, పెద్దల్ -తమ కంటె పెద్దలైన వారు/ వృద్ధులు, చావగాన్ – చనిపోతూ ఉండగా, చూడరు – ఓ – చూడ లేదా? పెండ్లాము – భార్య, బిడ్డల్ – సంతానం/ పిల్లలు, హిత – స్నేహితుల, వ్రాతంబు – సముదాయం, తిలకింప -చూచుచుండగా, జంతువులకున్ – జీవులకు, వాలయము – ఐ – తప్పనిసరియై, ఉండగా – ఉన్నప్పుడు, చావునకు – కాన్ – మరణానికి, భీతిన్ – భయాన్ని, పొందగన్ – పొందటానికి, ఏల – ఎందులకు? నరుండు – మానవుడు, చేతోవీధిన్ – మనోవీధిలో, నిన్ – నిన్ను, కొలువడు – ఓ – సేవించడా? ( సేవిస్తే భయం ఉండదని భావం)
తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! మానవులు తమ తాతలు, తల్లితండ్రులు, ఇతర పెద్దలు మరణించటం చూడలేదా? తమతో పాటు భార్యాపిల్లలు, మిత్రులు కూడా చూస్తున్నారు కదా! జీవులు అన్నింటికీ మృత్యువు తప్పనిసరి అయినప్పుడు మరణమంటే భయపడటం ఎందుకు? (ఇంత తెలిసీ) మానవుడు మనసు నందు నిన్నెందుకుధ్యానించడో తెలియటం లేదు.
విశేషం:
జంతువు అంటే పుట్టినది, జనన మొందినది. పుట్టిన ప్రతిజీవి గిట్టటం సహజం. ఇది మౌలికసత్యం. ఇదెవ్వరికైనా తెలియదంటే – జరుగుతున్న దానిని చూస్తే అయినా అర్థం అవుతుంది కదా! తనంతట తనకి అర్థం కాకపోయినా భార్య, పిల్లలు, హితులు (మేలు కోరేవారు), అయినా చెపుతారుకదా!ఒకరినొకరుఓదార్చుకునేప్పుడు ఇటువంటి విషయాలే మాట్లాడుతారుగా! అటువంటప్పుడుప్రాణిసహజమైన మరణానికి భయపడటం ఎందుకు? ఇంకా భయం మిగిలి ఉంటే శివధ్యానం దానిని పోగొడుతుంది కదా,మానవులు శివుణ్ణి భక్తితో భజించ రెందుకు? శివధ్యానంమృత్యుభీతిని పోగొడుతుంది కదా! అని ధూర్జటి లోకుల అజ్ఞానం పై జాలిని ప్రకటిస్తున్నాడు ఈ పద్యంలో.
డాక్టర్ అనంతలక్ష్మి