98
పదివేలైనను లోకకంటకులచే ప్రాప్తించు సౌఖ్యంబు నా
మదికిన్పథ్యముగాదుసర్వమునకున్మధ్యస్థుడై సత్య దా
న దయాదుల్గల రాజు నా కొసగు మే నవ్వానినీ యట్ల చూ
చి దినంబున్ముదమొందుదున్కడపటన్శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, లోకకంటకులచే – ప్రజలను పీడించువారి చేత, ప్రాప్తించు – లభించునట్టి, సౌఖ్యంబు – సుఖము, పదివేలు – ఐనను – ఎంతో అధికం అయినా కాని, నా మదికిన్ – నా మనసుకి, పథ్యము కాదు – హితం కాదు, సర్వమునకున్ – అన్నింటికిని, మధ్యస్థుడు – ఐ – సమప్రాధాన్యం ఇచ్చే వాడై (పక్షపాతబుద్ధి లేని వాడై), సత్య – సత్యం (నిజం పలకటం), దాన – ఈవి (ఇతరులకి ఇచ్చే గుణం), దయ – కరుణ, ఆదుల్ – మొదలైనవి, కల – కలిగినటువంటి, రాజున్ – రాజుని (పరిపాలకుణ్ణి), నాకు – ఒసగుము – నాకు ( పోషకుడిగా) ప్రసాదింపుము,ఏను -నేను, ఆ – వానిన్ – అతడిని (ఆ రాజుని), నీ – అట్లు – నీ వలె / నీతో సమానంగా, చూచి – భావించి / తలచి / సేవించి, దినంబున్ – ప్రతిరోజు, కడపటన్ – చివరకు / అంత్యకాలం వరకు, ముదము – ఒందుదున్- సంతోష పడతాను.
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! ప్రజాకంటకులైన రాజుల వలన లభించే సౌఖ్యం పదివేలైనా, అది నా మనసుకి నచ్చదు. అన్ని విషయాలలోనూ పక్షపాతవైఖరి లేక సత్యం, దానం, దయ మొదలైన సద్గుణాలు కల రాజుని పోషకునిగా లభింప చేయి. ఆ రాజుని నీతో సమంగా భావించి, ప్రతిరోజు సేవించి, చివరి వరకు సంతోషాన్ని పొందుతాను.
విశేషం:ఇది దుష్టులైన రాజులని నిరసించే పద్యం. ‘రాజు’ అంటేనేఆనందింపచేసేవాడుఅని అర్థం. కాని, రాజులు రంజింప చేయలేక పోయినా పరవాలేదు కాని, లోకకంటకులుగా కూడా ఉంటారు. అటువంటివారు తన కెంత ఇచ్చినా తన మనస్సుకి హితవు కాదట. హితవు లేక పథ్యము అంటే మేలు కలిగించేదిఅని అర్థం. అది ప్రియంగా అంటే ఇష్టంగా, నచ్చేదిగాఉండక పోవచ్చు. అంటే ఆ రాజు లిచ్చే ధనం వల్ల భౌతికసుఖాలు లభించి నట్టు ఉండవచ్చు. కాని, మేలు మాత్రం జరగదు. సద్గుణ సంపత్తి గల రాజుని పోషకునిగా లభింప చేసినట్లయితే, అతడిని శివుడితో సమంగా చూస్తానన్నాడు.
శుభలక్షణాలు కల వారందరూ శివస్వరూపులే ధూర్జటికి.
డాక్టర్ అనంతలక్ష్మి